బాలికపై 3 నెలలుగా బాబా అత్యాచారం.. నిజామాబాద్‌లో దారుణం - MicTv.in - Telugu News
mictv telugu

బాలికపై 3 నెలలుగా బాబా అత్యాచారం.. నిజామాబాద్‌లో దారుణం

October 13, 2020

మహిళలను కాటేయడానికి మృగాళ్లు రకరకాల రూపాల్లో వస్తున్నారు. క్షణిక సుఖం కోసం కూతురు, చెల్లెలు, తల్లి వరుస అవుతారన్న కనీస ఇంగితం కూడా లేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ దొంగబాబా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరోగ్యం బాగాలేదని అతనివద్దకు వెళ్లి తాయత్తులు కట్టించుకుందామనుకున్నారు. వారిని తన ఆశ్రమంలోనే కొన్ని రోజులు ఉంచితే ఆరోగ్యం కుదుటపడుతుందని బాబా చెప్పాడు. వాళ్లు అతని మాటలు నమ్మారు. బాలిక మీద కన్నేసిన ఆ కీచకుడు ఆమెపై  పలుమార్లు అత్యాచారం చేశాడు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించగా అతని కీచక పర్వం బయటపడింది. కలకలం రేపుతున్న ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 

ఆరోగ్యం బాగలేకపోవడంతో బాలికను భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే, బాలికపై కన్నేసిన భూతవైద్యుడు వైద్యం పేరిట బాలికకు మత్తుమందు ఇచ్చి 3 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. దీంతో సదరు చిన్నారి తన కన్నవాళ్లకు ఈ విషయం చెప్పలేకపోయింది. ఈ క్రమంలో బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. బాలికను తల్లిందండ్రులు నిలదీయగా అసలు విషయం చెప్పింది. ఇంట్లో చెప్తే చంపేస్తానని తనను  దొంగబాబా బెదిరించినట్టు బాలిక తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మరోవైపు మహిళా సంఘాలు, స్థానికులు దొంగబాబాపై దాడి చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.