Exorcist treatment of a patient in ICU ,in sadar gumla jharkhand
mictv telugu

ఐసీయూలో ఉన్న పేషెంట్‌కు భూతవైద్యుడి ట్రీట్‌మెంట్.. డాక్టర్ల సమక్షంలోనే

August 3, 2022

హాస్పిటల్‌లో ఐసీయూ వార్డులో ఉన్న ఓ మహిళ పేషెంట్‌కు భూతవైద్యుడు చికిత్స చేశాడు. ఆమె రోగాన్ని నయం చేస్తానంటూ ఏవేవో పూజలు చేశాడు. ఇదంతా ఆ హాస్పిటల్ లో ఉన్న డాక్టర్ల సమక్షంలోనే జరిగింది. ఈ వార్త గురించి విన్నాక ఆ మనుషులు ఏ కాలంలో ఉన్నారన్న అనుమానం రాకమానదు. ఈ విచిత్ర సంఘటన ఝార్ఖండ్‌లో వెలుగు చూసింది.
ఆంబువా ప్రాంతానికి చెందిన శక్తి నాయక్ భార్య అర్చన దేవి(25) పాము కాటుకు గురైంది. వెంటనే బంధువులు.. ఆమెను దగ్గరలోని గుమ్లా సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు.. మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు రిఫర్ చేశారు. వారు మాత్రం రిమ్స్‌కు వెళ్లకుండా.. సదర్ ఆసుపత్రికి ఓ భూతవైద్యుడ్ని పిలిపించారు. ఆ హాస్పిటల్ ఐసీయూ బ్లాక్‌లోకి వచ్చిన భూత వైద్యుడు.. వైద్యం పేరుతో సుమారు మూడు గంటలపాటు అక్కడున్న వారందరికీ ఓ సినిమా చూపించాడు.

అన్నం తినే ప్లేట్‌ను ఆ పేషెంట్ వీపు మీద పెట్టి ఏవో పూజలు చేశాడు. ఆమె శరీరం నుంచి విషం తీసినట్టుగా కాసేపు గిమ్మిక్కులు కూడా చేశాడు. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో.. సదర్ ఆసుపత్రి వైద్యులంతా అక్కడే ఉండి చూస్తూనే ఉన్నారు తప్ప ఏమీ అనలేదు. మూడు రోజుల క్రితం కూడా ఆ హాస్పిటల్ లో ఇలాంటి ఘటనే జరిగింది. పాముకాటుకు గురైన ఓ చిన్నారిని అతడి కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారు కూడా భూతవైద్యుడ్ని పిలిపించి ఆసుపత్రి ఆవరణలోనే భూతవైద్యం చేయించారు.