రూఫ్ టాప్ ఖాళీగా ఉండకుండా పెంట్‌హౌస్ కట్టేస్తుంటారు. ఏవో సరదా కాలక్షేపాలకని కొందరు, అద్దెకు ఇద్దామని కొందరు వీటిని కట్టేస్తుంటారు. కింది అపార్టుమెంట్లతో పోలిస్తే అద్దె కూడా తక్కువే. కానీ పురుషులందు పుణ్య పురుషులు వేరయా టైపులో పెంట్ హౌసులు కూడా ఈ మధ్య లగ్జరీ హంగులు అద్దుకుంటున్నాయి. దేశ రాజధాని ముంబైలోని ఓ పెంట్ హౌస్ కళ్లు బైర్లు కమ్మే ధరకు అమ్ముడుబోయింది. ఓ కుబేరుడు దీన్ని ఏకంగా రూ. 240 కోట్లు ధారపోసి కొనుక్కున్నాడు.
వర్లీ ప్రాంతంలో టవర్ ‘బి’లో 63, 64, 65 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. వెల్స్‌పన్ గ్రూప్ యజమాని బీకే గోయెంకా దీన్ని కొనుక్కుని బుధవారం రిజిస్టర్ చేయించుకున్నారు. దేశంలో ఒక పెంట్ హౌస్ అత్యధిక ధరకు అమ్ముడుబోవడం ఇదే తొలిసారి. దీన్ని కొనడానికి కారణం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై వచ్చే ఆదాయంపై పన్నుపోటు తప్పించుకోవడానికి గోయెంకా దీన్ని కొన్నట్లు చెబుతున్నారు. ఆ ఆదాయంపై మినహాయింపును రూ.10 కోట్లకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఆలోపు కొనుగోలు చేస్తే మినహాయింపు పరిమితిని తప్పించుకోవచ్చన్నది ధనికుల ఆలోచన. ముంబై సహా పలు ప్రాంతాల్లో స్థిరాస్తులు కొనుగోళ్లు ఊపందుకున్నాయని, ఏప్రిల్ 1వరకు ఈ జోరు సాగుతుందని చెబుతున్నారు.