అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు - MicTv.in - Telugu News
mictv telugu

అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు

May 25, 2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోనసీమ జిల్లాకు చెందిన అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చొద్దంటూ ఆందోళనకారులు మంగళవారం నిరసన చేపట్టారు. సాఫీగా సాగుతున్న నిరసన.. ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి, సెక్షన్ 144, 30 పోలీస్ యాక్టు కింద ఆంక్షలు విధించారు. పోలీసులు పెట్టిన ఆంక్షలను ఆందోళనకారులు లెక్క చేయకుండా తీవ్రంగా నిరసన తెలుపడంతో పోలీసుల మధ్య నిరసనకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

గత నెలన్నర క్రితం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పలు ప్రాంతాలను జిల్లాలుగా విభజన చేసిన విషయం తెలిసిందే. అందులో కోనసీమను కూడా జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్రంగా మండిపడుతూ, నిరసనలు చేపట్టారు. కోనసీమ పేరునే చివరివరకు కొనసాగించాలి అని పలు డిమాండ్లలతో ఆందోళనకారులు ధర్నాలు చేపట్టారు. వందల సంఖ్యలో వినతులను కలెక్టర్‌కు అందజేశారు. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి’ ‘చలో’ అమలాపురానికి పిలుపునిచ్చింది.

ఈ క్రమంలో సోమవారం నుంచే భారీగా మోహరించిన పోలీసులు.. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. అయినా ఆందోళనకారులు భారీ సంఖ్యలో గడియార స్తంభం దగ్గరకు చేరుకున్నారు. ‘కోనసీమ పేరే ముద్దు… మరోపేరు వద్దు’ అని నినదిస్తూ కలెక్టరేట్ వైపు దూసుకెళ్లారు. వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దాంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.  రాళ్ల దాడి నుంచి తప్పించుకోవడానికి పోలీసులు పరుగులు పెట్టారు. అనంతరం పలు వాహనాలకు నిప్పు అంటించారు. ప్రైవేట్ కళశాల బస్సులను ధ్వంసం చేశారు. అమలాపురంలోని ఎస్‌బీఐ కాలనీలో ఉన్న మంత్రి పినిపే విశ్వరూప్ క్యాంపు కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత నినాదాలు చేస్తూ, హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కూమార్ ఇంటి వద్దకు చేరుకొని, రాళ్లు రువ్వి, ఇంటిని ధ్వంసం నిప్పుంటించారు.