ట్రంప్ ‘లూటింగ్, షూటింగ్’ పోస్ట్.. తొలగించే ప్రసక్తే లేదన్న జుకర్  - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్ ‘లూటింగ్, షూటింగ్’ పోస్ట్.. తొలగించే ప్రసక్తే లేదన్న జుకర్ 

June 3, 2020

Mark Zuckerberg.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై తీవ్ర రగడ నడుస్తోంది. ‘దోపిడీ ప్రారంభమైతే.. షూటింగ్ ప్రారంభమవుతుందిఅని ట్రంప్ నిరసనకారులకు వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్ దుమారానికి దారి తీసింది. ఈ పోస్టును ట్విటర్ తొలగిస్తూ.. ట్రంప్ పోస్ట్ తమ సంస్థ నియమాలకు వ్యతిరేకంగా ఉందంటూ పేర్కోంది. అయితే ఫేస్‌బుక్ మాత్రం ఆయన పోస్ట్‌ను తొలగించలేదు. దీంతో ఫేస్‌బుక్ ఉద్యోగులు సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. నిరసనకారులను కాల్చుతామంటూ దేశాధ్యక్షుడు పోస్ట్ పెడితే.. ఆ పోస్ట్‌ను సంస్థ తొలగించకపోవడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అనేకమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.

ఈ క్రమంలో మంగళవారం మార్క్ జూకర్‌బర్గ్ కంపెనీ ఉద్యోగులతో వీడియో కాల్‌లో మాట్లాడారు. తొంబై నిమిషాల పాటు సాగిన ఈ వీడియో సమావేశంలో ఉద్యోగులు మార్క్ జూకర్‌బర్గ్‌పై విమర్శలు గుప్పించారు. అయితే మార్క్ మాత్రం బెట్టుమీదే ఉన్నారు. ట్రంప్ పోస్ట్‌కు సంబంధించి తన నిర్ణయాన్ని మార్చుకోనని ఖరాఖండిగా చెప్పారు. ‘ట్రంప్ పోస్ట్‌పై నేను, కంపెనీ పాలిసీ టీం చర్చించాం. ఆ పోస్ట్ ఫేస్‌బుక్ నియమాలను ఉల్లంఘించలేదు.  హింసాత్మకంగా ఉండే పోస్ట్‌లకు సంబంధించి కంపెనీ నియమాలను మార్చాలా లేదా.. పోస్ట్‌లను తొలగించకుండా ఫ్లాగ్ చేయాలా అన్న దానిపై కంపెనీ ఆలోచిస్తోంది’ అని మార్క్ తెలిపారు. కాగా.. తెల్లజాతీయ పోలీస్ అధికారి చేతిలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అమెరికాలో సంచలనంగా మారింది. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తరువాత అమెరికా అట్టుడుకుతోంది. వారం రోజుల నుంచి అమెరికాలో పరిస్థితులు అదుపు తప్పాయి. ప్రస్తుతం అమెరికాలో ప్రస్తుతం కరోనా అంశాన్ని మరిచిపోయి.. దీనిగురించే ఆందోళనలు కొనసాగుతున్నాయి.