ఫేస్‌బుక్ ప్రేమ..దేశ సరిహద్దులు దాటి, భారత్‌లోకి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్ ప్రేమ..దేశ సరిహద్దులు దాటి, భారత్‌లోకి..

June 1, 2022

బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణ మండల్‌ (22) అనే యువతి తన ప్రియుడి కోసం దేశ సరిహద్దులు దాటి భారత్‌లోకి అడుగుపెట్టిన సంఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఫేస్‌బుక్‌‌లో కోల్‌కతాకు చెందిన అభిక్‌ మండల్‌ అనే యువకుడితో కృష్ణ మండల్‌‌ (బంగ్లాదేశ్)కు పరిచయం ఏర్పడింది. రాను రాను అది ప్రేమగా మారింది. దాంతో ఆ యువతి అతనిని పెళ్లి చేసుకోవడానికి దేశ సరిహద్దులను దాటి, దట్టమైన సుందర్బన్‌ అడవుల గుండా ప్రయాణించి, గంటపాటు నదిలో ఈదుకుంటూ భారత్‌లోకి ప్రవేశించింది. తాజాగా కోల్‌కతాలోని కాళీఘాట్‌ ఆలయంలో అభిక్‌ మండల్‌ను పెళ్లి కూడా చేసుకుంది.

కానీ, పోలీసులు ఆ ఫేస్‌బుక్ ప్రియురాలికి గట్టిషాక్ ఇచ్చారు. దేశంలోకి కృష్ణ మండల్‌ అక్రమంగా ప్రవేశించిందన్న నేరంపై పోలీసులు సోమవారం ఆమెను అరెస్టు చేశారు. త్వరలోనే ఆమెను బంగ్లాదేశ్‌‌కు తిరిగి పంపిస్తామని, ఆ దేశ హై కమిషనర్‌కు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.

మరోపక్క బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలుడు గతంలో ఇదే మాదిరిగా, తనకిష్టమైన చాక్లెట్‌ కోసం దేశ సరిహద్దులు దాటి, నదిని ఈదుకుంటూ, భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ బాలుడిని అధికారులు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో కృష్ణ మండల్‌ కూడా తన ఫేస్‌బుక్ ప్రియుడి కోసం దేశ సరిహద్దులు దాటి భారత్‌లోకి అడుపెట్టడం సంచలనంగా మారింది. కానీ, ప్రభుత్వ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.