ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌ ఆప్షన్‌పై విమర్శలు - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌ ఆప్షన్‌పై విమర్శలు

March 16, 2019

సోషల్ మీడియా ఎంత ఉపయోగకరమో అంతే ప్రమాదకరమని ఎన్నో సంఘటనలు వెల్లడిస్తున్నాయి. ఎందరో యువత సోషల్ మీడియా మోజులో పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కొందరైతే ఘోరాలకు పాల్పడుతూ ఆ ఘోరాన్ని లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి ఓ సంఘటనే ఇటీవల న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పుల నేపథ్యంలో సోషల్ మీడియా వెబ్‌సైట్స్ అయిన ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లపై విమర్శలు వస్తున్నాయి. క్రిస్ట్‌చర్చ్ నగరంలోని అల్‌‌నూర్‌ మసీదు వద్ద కాల్పులకు పాల్పడ్డ దుండగుడు దాడినంతా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు న్యూజిలాండ్‌ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 17 నిమిషాల పాటు ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ జరిగినట్లు తెలిపాయి. అయితే ఈ లైవ్‌ను మసీదులో ఉన్న ఓ వ్యక్తి తొలుత చూశాడు. అతడు అందర్నీ వారించేలోపు దారుణం జరిగిపోయింది. దీంతో సోషల్ మీడియాపై కొన్ని ఏజెన్సీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఉన్న లైవ్‌ స్ట్రీమింగ్ సదుపాయాన్ని మంచి సందర్భాల కోసం కాకుండా ఇలాంటి దారుణాలకు ఉపయోగించడం సరి కాదని సదరు ఏజెన్సీలు తెలిపాయి.

Facebook, YouTube and Twitter struggle to deal with New Zealand shooting video

మొత్తం 17 నిమిషాల పాటు లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తుంటే ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నాయి. దాడి జరిగిన కొన్ని గంటల్లోపు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి ఘటనలను సామాజిక మాధ్యమాలు ప్రోత్సహించకుండా ప్రత్యామ్నాయం కనిపెట్టాలని సూచిస్తున్నాయి. ఏజెన్సీల వ్యాఖ్యలపై ఫేస్‌బుక్ స్పందించింది. ‘ఈ లైవ్‌కు సంబంధించి పోలీసులు తమకు ఫిర్యాదు చేశారని వెంటనే ఈ దాడికి సంబంధించిన వీడియోలను, ఇతర సమాచారాన్ని పూర్తిగా తొలగించామని ఫేస్‌బుక్‌ తెలిపింది. రెండు మసీదుల్లోనూ దాడికి పాల్పడ్డ నిందితుల ఖాతాలను వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తొలగించినట్లు ఫేస్‌బుక్‌ ట్వీట్‌ చేసింది. నిందితులకు మద్దతుగా పోస్టులు చేసిన వారి ఖాతాలను డిలీట్‌ చేసినట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది.