Fact Focus revealed assets of Pakistan Army Chief Qamar Javed Bajwa
mictv telugu

దేశం అప్పుల ఊబిలో.. వేల కోట్లు సంపాదించిన ఆర్మీ చీఫ్

November 21, 2022

పొరుగు దేశం పాకిస్తాన్ ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గతంలో తీసుకున్న రుణాలకు వడ్డీలు కట్టలేని స్థితికి వెళ్లిపోయింది. దిగుమతులకు చెల్లించడానికి డబ్బులు లేక సౌదీ అరేబియా, చైనాల కాళ్లు పట్టుకుంటోంది. కానీ ఆ దేశ ఆర్మీ చీఫ్ మాత్రం వేల కోట్లు సంపాదించాడు. ప్రధాని కంటే పవర్ ఫుల్ అని భావించే పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా మరికొద్ది నెలల్లో రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ కాకముందు, ఇప్పుడు అతని ఆస్తులపై ఫ్యాక్ట్ ఫోకస్ అనే సంస్థ ఓ ఇన్వెస్టిగేటివ్ కథనాన్ని ప్రచురించింది. దాన్ని ఓ జర్నలిస్టు బహిర్గతం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఈ స్టోరీ ప్రచురించగా, వెంటనే చర్యలు తీసుకొని ఆ సంస్థ వెబ్ సైట్‌ను బ్లాక్ చేయడం గమనార్హం. కథనం ప్రకారం.. గత ఆరేళ్లలో బాజ్వా కుటుంబ సభ్యులు విదేశాల్లో వేల కోట్ల వ్యాపారం ప్రారంభించారు.

ఇస్లామాబాద్, కరాచీలలో కమర్షియల్ ప్లాజాలు, ప్లాట్లు, లాహోర్‌లో రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుగోలు చేశారు. 2015లో బాజ్వా భార్యపై ఆస్తులు ఏమీ లేవు, కానీ 2016లో రూ. 220 కోట్ల ఆస్తులు ఆమె పేరిట ఉన్నాయి. 2018లో బాజ్వా కుమారుడిని పెళ్లి చేసుకున్న మహనూర్ సాబిర్ ఆస్తులు వివాహమైన వారానికే రూ. 127 కోట్లకు చేరింది. పాకిస్తాన్‌లో అత్యంత శక్తివంతమైన పోస్టులో ఉన్న బాజ్వా ఆస్తులు, వ్యాపారాల విలువ మొత్తం 12.70 బిలియన్ పాకిస్తానీ రూపాయలుగా ఉందని సంస్థ వెల్లడించింది. అమెరికా డాలర్లలో దాదాపు 56 మిలియన్ డాలర్లు ఉంటుందని పేర్కొంది.