అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలకు మావోస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ హత్య చేయడానికి ముందు కిడారికి, మావోస్టులకు మధ్య జరిగిన విషయాలు బయటకు వస్తున్నాయి. కిడారి వాహానాన్ని రౌండప్ చేసిన మావోలు, కిడారి, సోమలను కొంత దూరం నడిపించారు. అరమ రోడ్డులో చెట్టు కింద కిడారికి, మావోలకు మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ‘కూర్చుని మాట్లాడుకుందాం.. కాల్పులు జరపవద్దు’ అని కిడారి వేడుకున్నట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.‘గూడ క్యారీ మైనింగ్, రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తాను. నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి’ అని ఎమ్మెల్యే కిడారి మావోయిస్టులను వేడుకున్నారని, ఘటన స్థలానికి కొంచెం దూరంలో ఉన్నవారు వివరించారు. ‘కోట్ల రూపాయలు తీసుకుని పార్టీ మారావు. ఆ డబ్బు చాలలేదా?బాక్సైట్ కోసమే రహదారులను నిర్మిస్తున్నారు. బాక్సైట్ వెలికితీస్తే గిరిజనుల జీవితాలు నాశనం అవుతాయి’ అని మావోలు, కిడారిని నిలదీశారు. గూడ క్వారీ అంశం గురించి కూడా ప్రస్తావించి మావోయిస్టులు ‘ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాం.. ఇక చాలు’ అంటూ కాల్పులు జరిపి, కిడారిని, సోమలను హత్య చేశారని చెప్పారు.
కిడారి హత్యకు రెండు రోజుల ముందే ఓ పోలీసు అధికారి ఆయనను హెచ్చరించారు. మావోల హిట్ లిస్ట్‌లో నువ్వు ఉన్నావని తెలిపారు. నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. గ్రామాల్లో పర్యటించడం మంచిదికాదని హెచ్చరించారు. అధికారి సూచనలను తేలిగ్గా తీసుకున్న కిడారి గ్రామదర్శినిలో పాల్గొన్నారు. త్వరలోనే ఎన్నికలు ఉన్నాయని, ప్రజల్లో ఉండకపోతే ప్రయోజనం ఉండదని, ప్రాణభయంతో పర్యిటంచకుండా ఉండలేమని కిడారి చెప్పారు. పోలీస్ అధికారితో భేటి అయిన 48 గంటల్లోనే కిడారి హత్యకు గురయ్యారని, ఆయన అనుచరులు ఆవేదనతో చెప్పారు.