Fadnavis took good decisions, will meet him, says Sanjay Raut
mictv telugu

ఫైర్‌బ్రాండ్…పార్టీ మారబోతున్నారా?

November 10, 2022

 

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పార్టీ మార్చేయబోతున్నారా?వంద రోజుల జైలు జీవితం ఆయనలో మార్పు తెచ్చిందా.? ఫడ్నవీస్ పై ప్రశంసలు, షిండే సర్కార్ పై పొగడ్తలు దేనికి సంకేతం. అంతేకాదు మూడు,నాలుగో రోజుల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎందుకు కలువబోతున్నారు.సంజయ్ రౌత్ స్వరం ఒక్కసారిగా మారడానికి కారణాలేంటి?మహారాష్ట్రలో ఉద్దవ్‌కు మళ్లీ షాక్ తప్పదా?విచిత్ర మార్పుల్ని చూస్తే అవుననే అనిపిస్తోంది.

స్వరం మారింది

సంజయ్ రౌతు…శివసేన ఎంపీ. ఉద్దవ్ థాకరే హయాంలో చక్రం తిప్పారు. ముంబై నుంచి ఢిల్లీదాకా రాజకీయాల్ని ఒంటిచెత్తో నడిపించేవారు. సందు దొరికితే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. ఎగిరెగిరి పడిన సంజయ్ రౌత్‌కు, శివసేన సర్కార్‌కు మోదీషా ద్వయం ఊహించని విధంగా చెక్ పెట్టింది. సంజయ్ రౌత్‌ని ఊచలు లెక్కపెట్టిస్తే…ఉద్దవ్ థాకరేపైకి ఏక్ నాథ్ షిండేని ఎగేసింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..షైనింగ్ శివసేన ఖేల్ ఖతం అయింది. మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ వంద రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. జైలు వచ్చీరాగానే స్వరం మారింది.

ఫడ్నవీస్ గ్రేట్

ముంబైలోని నివాసం నుంచి సంజయ్ రౌత్ మీడియా మాట్లాడారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఏక్ నాథ్ షిండే సర్కార్‌ను మంచి నిర్ణయాలతో ఫడ్నవీసే ముందుండి నడిపిస్తున్నారన్నారు. మంచి విషయాల్ని స్వాగతించాలని,ప్రత్యర్థులని గుడ్డిగా వ్యతిరేకించవద్దన్నారు. “ఉద్దవ్ , శరద్ పవార్ ని కలుస్తా..అన్ని విషయాలు చర్చిస్తా.రెండు, మూడురోజుల్లో మహారాష్ట్ర డిప్యూటీసీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమవుతా.ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షా కలుస్తా” అని సంజయ్ రౌత్ చెప్పారు.

సడెన్ గా మార్పు ఏంటో…

సంజయ్ రౌత్ స్వరం జైలుకెళ్లివచ్చాక మారింది. ఉన్నట్టుండి ప్రత్యర్థుల్ని ఎందుకు పొగడుతున్నారని మీడియా ప్రశ్నిస్తే… మంచిని మంచిగా చెప్తే తప్పేంటి అని సంజయ్ రౌత్ అన్నారు. మరి ప్రధాని మోదీ ,హోంమంత్రి అమిత్ షాలను ఎందుకు కలుస్తున్నారని అడిగితే..” నేను ఎంపీ, మా సోదరుడు ఇక్కడ ఎమ్మెల్యే.. ప్రజాప్రతినిధులుగా ఎవరినైనా కలిసే హక్కు ఉంది. కేంద్రహోంమంత్రి దేశం మొత్తానికి ,,బీజేపీకి కాదు. ఎవరిపై ఫిర్యాదుల్లేవని, రాజకీయ ప్రతీకారం లేదు” అని స్పష్టం చేశారు. సంజయ్ రౌత్ తీరు మహారాష్ట్రవాసుల్ని ఆశ్చర్యపరుస్తోంది. మాటల్లో వైరుద్యం ఏంటో అని అంతా చర్చించుకుంటున్నారు. కొంపదీసి పార్టీ మారుస్తారేమోనని అనుకుంటున్నారు.