క్రికెట్‌లో రీ ఎంట్రీలు, సెకెండ్ ఇన్నింగ్స్‌లు చాలా అరుదు. ఒక్కసారి రిటైర్మెంట్ ఇచ్చి ప్లేయర్ మళ్లీ జట్టులోకి రావడం జరగని పని. అందులోనూ స్టార్స్ ప్లేయర్స్ ఆటకు వీడ్కోలు పలికితే తిరిగి తమ నిర్ణయాన్ని మార్చుకోరు. అలా మార్చుకున్నవారిని చాలా తక్కువగా చూస్తుంటాం. కానీ తాజాగా దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరిగి దక్షిణాఫ్రికా జట్టులో ఆడేందకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం వైట్ బాల్ ఆటల్లో కొనసాగేందుకు ఆసక్తిగా ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి.ఆ కథనాలు ప్రకారం స్వదేశంలో విండీస్ తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు డుప్లెసిస్ బరిలో దిగే అవకాశం ఉంది. మార్చి 16న ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
2021లో డుప్లెసిస్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. అడగలిగే సత్తా ఉన్నా ఒక్కసారిగా ఆటకు దూరమయ్యాడు. తర్వాత నుంచి అన్ని దేశాల లీగ్‌లలో డుప్లెసిస్ ఆడుతున్నాడు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో కూడా అదరగొట్టాడు. దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటివరకు 69 టెస్టులు, 143 వన్డేలు, 50 టీ20లు ఆడాడు.36 టెస్టుల్లో లీడ్ చేసిన ఫాఫ్ డుప్లెసిస్.. 18 మ్యాచ్‌లలో గెలిపించాడు. 2019లో ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా టీమ్ కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్.. ఆ టోర్నీలో ప్రొటీస్ విఫలమవడంతో దక్షిణాఫ్రికా బోర్డు అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో టెస్ట్, టీ20 టీమ్‌లకు కూడా కెప్టెన్‌గా తప్పుకున్నాడు.