పూజ గదిలో ఉన్న బంగారాన్ని వెలికితీస్తామని.. - MicTv.in - Telugu News
mictv telugu

పూజ గదిలో ఉన్న బంగారాన్ని వెలికితీస్తామని..

May 23, 2022

డబ్బు మీద అత్యాశతో సామాన్య మధ్యతరగతి ప్రజలు దొంగబాబాలని నమ్మి మోసపోతున్నారు. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పూజ గదిలో బంగారం వెలికి తీస్తామంటూ దొంగ బాబాలు చెప్పిన మాటలు నమ్మి ఓ వ్యక్తి రూ.7 లక్షల మేర మోసపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఇద్దరు ఫేక్ బాబాలను అరెస్టు చేసి వారి నుంచి రూ.15 వేల నగదు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మతం చందు, ఎర్నాళ్ల సంజీవ్‌లు నకిలీ బాబాలుగా అవతారం ఎత్తారు. హైదరాబాద్‌ శివారు ఎదులాబాద్‌లో పంచర్ దుకాణం నిర్వహిస్తున్న రాజు వద్దకు వచ్చి మాటలు కలిపి ఇంటికి తీసుకెళ్తే మంచి చేస్తామని చెప్పారు. అక్కడికి వెళ్లాక ఇంట్లో పూజా గది మూసి ఉండటాన్ని చూసి, అలా ఉంచితే అరిష్టమని పూజల పేరుతో రూ.35 వేలు వసూలు చేశారు. కొన్ని రోజులయ్యాక మరోసారి రాజు ఇంటికి వచ్చి… పూజ గదిలో 4 కోట్ల విలువైన బంగారం ఉందని… పూజలు చేస్తే బయటపడుతుందని చెప్పి పలు విడతల్లో రూ.7 లక్షలు వసూలు చేశారు. కొన్ని రోజులయ్యాక గది తెరిచి చూడాలని చెప్పి పరారయ్యారు.

దొంగ బాబాలు చెప్పినట్లుగానే కొన్ని రోజుల తర్వాత గది తెరిచి చూసిన రాజుకు అందులో ఏమీ కనిపించలేదు. దాంతో మోసపోయానని తెలుసుకున్న రాజు… ఈనెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నకిలీ బాబాల నుంచి 15 వేల రూపాయలు, కారు స్వాధీనం చేసుకున్నారు.