Fake bank operating in city, 8 other locations in Tamil Nadu busted
mictv telugu

ఏకంగా నకిలీ బ్యాంక్‌లనే సృష్టించాడు.. 9 బ్రాంచీలతో ..

November 9, 2022

Fake bank operating in city, 8 other locations in Tamil Nadu busted

ఫేక్ కరెన్సీని తయారు చేయడం, వాటిని చెలామణీ చేయడం.. ఇదంతా కుర్రతనం అనుకున్నాడో ఏమో.. ఓ ముదురు దొంగ ఏకంగా నకిలీ బ్యాంకులనే ఏర్పాటు చేశాడు. ఉద్యోగులను నియమించుకోవడం.. కస్టమర్లని అట్రాక్ట్ చేయడం, అకౌంట్లు తెరిపించి, డిపాజిట్లు తీసుకోవడం.. ఇలా ఒక్కటేమిటి? మనోడు ఇలా మొత్తం 9 బ్రాంచీలను తెరిచి దందా కొనసాగిస్తున్నాడు ఆ కేటుగాడు. అయితే ఈ విషయం పోలీసులకు ఎలా తెలిసిందో తెలియదు కానీ మొత్తానికి అతనితో పాటు, ఆ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులందర్నీ అరెస్ట్ చేశారు.

తమిళనాడుకు చెందిన చంద్రబోస్ అనే యువకుడు చెన్నైలో ఓ బ్యాంకును తెరిచాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ‘గ్రామీణ రైతుల సహకార బ్యాంకు’ అని పేరు పెట్టాడు. చెన్నై సహా మధురై, నామక్కల్, సేలం, ఈరోడ్ జిల్లాల్లో తొమ్మిది చోట్ల బ్రాంచీలు కూడా ఏర్పాటు చేశాడు. లండన్‌లో చదివిన అనుభవంతో, బ్యాంక్ ఏర్పాటు చేసి, ఆర్బీఐ నుంచి తమ బ్యాంకుకు గుర్తింపు కూడా ఉందని నిరూపిస్తూ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి… అన్ని బ్యాంకుల్లానే డిపాజిట్, విత్ డ్రా స్లిప్పులు, స్టాంపులతో పాటు సిబ్బందిని నియమించుకుని బ్యాంక్‌ను నడిపించాడు. ఉద్యోగం ఇవ్వడానికి కూడా రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా వసూలు చేశాడట.

పోలీసులు ఎవరో ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి.. అంతా వట్టి ఫేక్ అని పోలీసులు తేల్చారు. ఆయా బ్యాంకుల నుంచి ప్రస్తుతానికి రూ. 60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఉత్తుత్తిగా పని చేస్తున్న 46 మందిని మేనేజర్లు, క్యాషియర్లు, క్లర్కులను అదుపులోకి తీసుకున్నారు. కేటుగాడైన చంద్రబోస్ తెరవడంతో పాటు, డిపాజిట్ల పేరుతో రూ. 2 కోట్ల వరకు ప్రజల నుంచి వసూలు చేశాడని చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ వివరించారు. ఆ 9 ఫేక్ బ్యాంకులను మూసేసినట్లు చెప్పారు.