గూగుల్‌లో జాగ్రత్త.. కష్టమర్ కేర్ నంబర్లతో మనీ మాయం..
ఇప్పుడంతా అంతర్జాల మయం. ఏం అవసరం వచ్చినా వెంటనే మన వేళ్లు గూగుల్‌లో వెతుకుతుంటాయి. మనకేదైనా సమాచారం కావాలన్నా.. ఏదైనా వస్తువు విషయంలో సమస్య వుంటే వెంటనే కష్టమర్ కేర్‌తో మాట్లాడుతాం. కష్టమర్ కేర్ నంబర్ గూగుల్‌లో వెతికి మరీ ఫోన్ చేసి సమస్యను నివృతి చేసుకుంటాం. ఇక్కడే అసలు సమస్య వుంది అంటున్నారు సైబర్ నిపుణులు.
సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కష్టమర్ కేర్ అవతారం ఎత్తారు అంటున్నారు. ఆ నెంబర్లకు ఫోన్ చేయడం వల్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఇలాంటి మోసాలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇటీవల జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. దీనికి సంబంధించి రిఫండ్ రుసుముకు సంబంధించి గూగుల్‌లో వెతికి మరీ కస్టమర్‌కేర్‌తో మాట్లాడింది. అవతలి వ్యక్తి రిఫండ్ మొత్తం తిరిగి రావాలంటే ‘ఎనీ డెస్క్ యాప్’ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించడంతో ఆమె అలానే చేసింది. అంతే డబ్బులు మటుమాయం అయిపోయాయి. తర్వాత ఆమె పోలీసులను సంప్రదించగా తాను మాట్లాడింది సైబర్ నేరగాడితో అని తెలిసి నోరు వెళ్లబెట్టింది.
దీనిపై జొమాటో స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు తమ కస్టమర్ కేర్‌కు ‘కాల్ ఇన్’ సదుపాయం లేదని జొమాటో స్పష్టంచేసింది. ఇలాంటి ఘటనే చెన్నైలో మరొకటి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గూగుల్‌లో వెతికి కస్టమర్ కేర్ అనుకుని ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి యూపీఐ పిన్ చెప్పమన్నాడు. అయితే సదరు వ్యక్తి తెలివిగా ఆలోచించి తప్పుడు పిన్ నంబర్ చెప్పి నిలువుదోపిడీ కాకుండా తనను తాను రక్షించుకున్నాడు. ప్రస్తుతం ఇలాంటివి దేశవ్యాప్తంగా రెండు ఘటనలు నమోదయ్యాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. కస్టమర్ కేర్‌తో మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి అడిగినవన్నీ చెప్పకూడదని హెచ్చరిస్తున్నారు. మనం ఫోన్ చేస్తున్న నంబర్ అసలుదా.. నకిలీదా.. అనేది నిర్ధారించుకోవాలని అంటున్నారు. సదరు కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించి అక్కడ పేర్కొన్న ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయడం ఉత్తమం అంటున్నారు. అంతే తప్ప గూగుల్‌లో సెర్చ్ చేయగానే లభ్యమయ్యే ఫోన్ నంబర్‌కు ఫోన్ చేస్తే ఖాతాలో వున్న డబ్బులు ఊడ్చుకోవాల్సిందే అంటున్నారు.