Fake Doctor Treating Patients For 10 Years Arrested In Station Ghanpur
mictv telugu

పది ఫెయిల్.. పదేళ్లుగా ‘డాక్టర్‌’గా చెలామణి

November 22, 2022

ఎలాంటి విద్యార్హతలు లేకున్నా.. పదేళ్లుగా ‘డాక్టర్‌’గా చలామణి అవుతున్నాడో వ్యక్తి. తన దగ్గరికి వచ్చిన రోగులకి మెడిసిన్స్ ఇస్తున్నాడు, కొంత మందికి సర్జరీలు కూడా చేశాడు. అసలు విషయం తెలియని ఆ పేషంట్లు అతడిని గుడ్డిగా నమ్ముతుండటంతో డబ్బులు భారీగానే దండుకున్నాడు. ఆ ప్రాంతంలో బాగా పేరు కూడా సంపాదించాడు. చివరికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ నకిలీ వైద్యుడి గుట్టు రట్టు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన ఆకాశ్‌కుమార్‌ బిశ్వాస్‌ పదో తరగతి కూడా పాస్ కాలేదు. కొంతకాలం తన తాత వద్ద ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత పదేళ్ల క్రితం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లికి వచ్చి ఓ క్లినిక్‌ను ప్రారంభించాడు. ‘ఐఏఎమ్‌ (ఇండియన్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌)’ పేరిట బోర్డు పెట్టుకుని.. షేషెంట్లకు అల్లోపతి, ఆయుర్వేద మందులతో చికిత్సలు అందిస్తున్నాడు. ఒకవేళ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే కమీషన్‌ తీసుకొని వారిని వరంగల్‌లోని వివిధ ఆసుపత్రులకు పంపించేవాడు. ఈ విషయమై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం క్లినిక్‌లో తనిఖీలు చేశారు. అతని వద్ద ఎలాంటీ ధృవీకరణ పత్రాలు కానీ.. క్లినిక్ పెట్టడానికి తగిన అనుమతి, విద్యార్హత పత్రాలు కానీ.. ఏవీ లేనట్లు గుర్తించారు. వివిధ పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. పదేళ్లలో అతను 3,650 మందికి పైగా రోగులకు చికిత్సలు అందించినట్లు పోలీసులు వెల్లడించారు.