మద్యం అమ్మే జీవో.. ఉప్పల్ యువకుడి అరెస్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

మద్యం అమ్మే జీవో.. ఉప్పల్ యువకుడి అరెస్ట్ 

March 31, 2020

Fake GO Uppal youth arrested

కరోనా లాక్‌డౌన్‌తో మద్యం షాపులు మూతపడి మందుబాబులు అల్లాడిపోతున్నారు. వారానికి ఒక్కసారైనా అమ్మండయ్యా బాబూ అనే డిమాండ్లు వచ్చాయి. సందట్లో సడేమియాగా గత శనివారం తెలంగాణ ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన జీవో అంటూ ఓ ఉత్తర్వు వైరల్ అయింది. మందుబాబుల కోసం ఆదివారం వైన్స్ తెరుచుకుంటాయని అందులోని సారాంశం. 

అది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో మద్యప్రియులు ‘వినదగునెవ్వరు చెప్పిన’ చందంగా ఆదివారం బార్లవద్ద తిష్టవేశారు. అయితే అది ఫేక్ జీవో అని పోలీసులు తేల్చేయడంతో ఉస్సూరుమన్నారు. ఈ జీవో ఎలా వచ్చిందో ఆరా తీసిన పోలీసులు నిందితుణ్ని పట్టుకున్నారు. ఉప్పల్‌కు చెందిన సన్నీ అనే యువకుడు ఈ ఫేక్ జీవో సృష్టించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అతణ్ని ఈ రోజు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కరోనా సాకుతో ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.