నకిలీ డాక్టర్, నకిలీ పోలీస్, నకిలీ ఆఫీసర్.. వంటి వార్తలను ఇప్పటివరకు వినే ఉంటారు కానీ.. నకిలీ ఎమ్మెల్యే గురించి మాత్రం ఎక్కడ కూడా కనివిని ఎరిగిఉండరు. ఓ నకిలీ ఎమ్మెల్యే పోలీసులతో సహ ఏకంగా అసెంబ్లీ ప్రాంగణంలోకే వెళ్లిన పశ్చిమ బెంగాల్ లో కలకలం రేపింది. వైట్ షర్ట్..పైన బ్లాక్ కోటు వేసుకొని తానో సీనియర్ ఎమ్మెల్యేలా బిల్డప్ ఇచ్చాడు. ఏ మాత్రం బెదురు లేకుండా దర్జాగా అసెంబ్లీలో అడుగుపెట్టొచ్చన్నకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది.
గజానన్ వర్మ అనే వ్యక్తి తనను తాను ఎమ్మెల్యేగా పరిచయం చేసుకుని పశ్చిమ బెంగాల్ శాసనసభలో బుధవారం ప్రవేశించాడు. హౌరాలోని శిబ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే మనోజ్ తివారీగా నటిస్తూ, వర్మ అసెంబ్లీ లాబీలోకి ఎంటరయ్యాడు. విధానసభ గేటు దాటి లోపలికి వచ్చాడు ఆ ఫేక్ ఎమ్మెల్యే. ప్రధాన భవనం వద్దకు చేరుకున్న అతడిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఎవరు? ఏంటీ? అని ప్రశ్నించగా.. సహకార శాఖ మంత్రి అరూప్‌రాయ్ స్థానంలో తాను అసెంబ్లీకి వచ్చానని పొంతన లేని సమాధానాలు చెప్పాడు. వెంటనే అతన్ని పోలీసులకు అప్పగించారు అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది. ఈ ఘటనతో అసెంబ్లీ వద్ద భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా జరిగిన ఈ ఫేక్ ఎమ్మెల్యే ఇష్యూ రాజకీయంగా దుమారం రేపుతోంది. తాను ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ ఏకంగా అసెంబ్లీలోకే ప్రవేశించేందుకు ప్రయత్నించడంపై బీజేపీ భగ్గుమంటోంది. అసెంబ్లీలో భద్రతపై మమత సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన అధికారపక్షం..అసలేం జరిగిందో ఆరా తీస్తున్నామంటోంది.