కారులో అస్థిపంజరం, దానికో బెల్ట్.. డ్రైవర్ కక్కుర్తి..  - MicTv.in - Telugu News
mictv telugu

కారులో అస్థిపంజరం, దానికో బెల్ట్.. డ్రైవర్ కక్కుర్తి.. 

January 25, 2020

Fake skeleton in car 

ఓ కారులో అస్థిపంజరం ప్రయాణించింది. డ్రైవర్ పక్కన ఎంచక్కా టోపీ, కళ్లద్దాలు పెట్టుకుని, నడుముకు బెల్ట్ చుట్టుకుంది. ఒడిలో సూట్ కేసు పెట్టుకుని జామ్మని చక్కర్లు కొట్టింది. రోడ్డుపై వెళ్లున్న వాళ్లు, గస్తీ పోలీసులు మొదట పట్టించుకోలేదు. అంత పకడ్బందీగా తీసుకెళ్లాడన్నమాట డ్రైవర్. అయితే రంకూబొంకూ చాన్నాళ్లు దాగదన్నట్లు పిశాచ బండారం బయటపడింది. హైవే పోలీసులకు కారులో ‘తేడా’ ప్యాసింజర్ ప్రయాణిస్తున్నాడని అనుమానం కలిగింది. డోర్ తెరిచి దాన్ని లాగిపడేశారు. 

అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో గురువారం జరిగిందీ వింత. వేగంగా వెళ్లేందుకు వీలుగా ఓ డ్రైవర్.. ప్రేతాన్ని ఇలా తీసుకెళ్లాడు.  ఒక వాహనంలో ఒకరికంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటే వారు వేగంగా వెళ్లేందుకు వీలుగా హెవోవీ లైన్(హైఆక్యుపెన్సీ వెహికల్) లేన్ లలోకి అనుమతి ఉంటుంది. 62ఏళ్ల వృద్ధుడు కమ్ డ్రైవర్ ఆ లేన్‌లో వెళ్లాలనుకున్నాడు. అయితే బండిలో తాను తప్ప మరొకరు లేకపోవడంతో ఓ నకిలీ అస్థిపంజరాన్ని పట్టుకొచ్చి దానికి ప్యాసింజర్ వేషం వేశాడు. చివరకు పోలీసులకు చిక్కి జరిమానా చెల్లించాడు. అమెరికాలో ఇలాంటి కేసులు మామూలేనంట. గత ఏడాది ఏప్రిల్లో ఓ వ్యక్తి మానెకిన్(చెక్కబొమ్మ)కు చొక్కా వేసి, కళ్లద్దాలు పెట్టి తీసుకెళ్తూ బుక్కయ్యాడు.