పడిపోతున్న కోడిగుడ్ల ధర..పెరిగిన చికెన్ ధర - MicTv.in - Telugu News
mictv telugu

పడిపోతున్న కోడిగుడ్ల ధర..పెరిగిన చికెన్ ధర

April 23, 2022

తెలంగాణ వ్యాప్తంగా కోడిగుడ్ల ధర రోజురోజుకు పడిపోతుంది. మరోవైపు చికెన్ ధర మాత్రం తగ్గేదేలే అంటూ కొండెక్కుతోంది. ఇంకోవైపు ఎండ తీవ్రత తట్టుకోలేక కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో కోళ్ల ఫారాల యాజమానులు ఆవేదన చెందుతున్నారు. నష్టాల ఊబిలో పడుతున్నామని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పది సంవత్సరాలలో మొదటిసారిగా కోళ్ల పరిశ్రమ తీవ్రమైన నష్టాల బాట పట్టిందని పౌల్ట్రీ రైతులు తెలిపారు. తమకు ఆత్మహత్యలే శరణ్యమని కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 500కి పైగా కోళ్ల పరిశ్రమలు ఉండగా, వాటిలో సుమారు 25 లక్షల వరకు మాత్రమే కోళ్లను రైతులు పెంచుతున్నారు. ఇటీవల కాలంలో దాణా రేట్లు పెరగడం, గుడ్డు ధర మూడు రూపాయలకు చేరుకోవడంతో రైతులు చిక్కుల్లో పడ్డారు. కోళ్ల దాణా టన్ను రూ.18 వేల నుంచి రూ. 30 వేలకు చేరుకోవడం, అదేవిధంగా కోళ్ల మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఒక్కొక్క కోడిగుడ్డు ఉత్పత్తికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మొరపెట్టుకుంటున్నారు.

పెరిగిన విద్యుత్‌ చార్జీలు, కూలీలకు వేతనాలు, ఇతర ఖర్చులతో కలుపుకుని ఒక గుడ్డు ఉత్పత్తికి సుమారుగా రూ.4ల వరకు ఖర్చవుతుంది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర రూ.4.23 నుంచి 5వరకు ఉంది. రైతులకు మాత్రం రూ.2.95లకే చెల్లిస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి కొత్త బ్యాచ్‌లను వేసేందుకు కూడా రైతులు వెనకాడుతున్నారు.

మరోవైపు చికెన్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర రూ. 300కు చేరువలో ఉంది. గతేడాది అక్టోబర్‌లో మొదలైన పెరుగుదల ఇప్పటివరకూ తగ్గలేదు. దీంతో సామాన్యులు చికెన్ తినే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు పెళ్లిళ సీజన్ కావడంతో ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్ రూ. 250 నుంచి రూ. 300 పలుకుతోంది.