మోదీపై తప్పుడు ఆరోపణలు.. తీస్తా సీతల్వాడ్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీపై తప్పుడు ఆరోపణలు.. తీస్తా సీతల్వాడ్ అరెస్ట్

June 26, 2022

గుజరాత్ అల్లర్ల కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ బృందానికి తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని శాంతాక్లాజ్ ప్రాంతంలో ఆమెను ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల ముందే గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కేసులో పూర్వాపరాలపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై వ్యతిరేకతతో కొందరు ఉన్నతాధికారులు ఇతరులతో కుమ్మక్కై తప్పుడు సమాచారం ఇచ్చారని వ్యాఖ్యానించింది. తప్పుడు సాక్ష్యాలు ఇచ్చిన అధికారులు, కేసును స్వంత ప్రయోజనాలకు వాడుకున్న తీస్తాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దీంతో తీస్తాతో పాటు మాజీ డీజీపీ శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌పై ఏటీఎస్ కేసులు నమోదు చేసింది. అటు మాజీ డీజీపీ శ్రీకుమార్ అరెస్టుపై మాజీ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేశారన్న ఆరోపణలపై నంబినారాయణన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. దీంతో తాజా పరిణామాలపై మాట్లాడిన నంబి.. తప్పుడు ఆధారాలు సృష్టించి తనను బలిపశువును చేసిన వ్యక్తిని అరెస్టు చేయడం సబబేనని పేర్కొన్నారు. కాగా, ఈయన జీవిత కథ ఆధారంగానే మాధవన్ నటించిన చిత్రం రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్ జులై 1న విడుదలకు సిద్ధంగా ఉంది.