ప్లేట్‌లెట్ల బదులు పండ్ల రసం ఎక్కించారు.. డెంగ్యూ పేషెంట్ మృతి! - MicTv.in - Telugu News
mictv telugu

ప్లేట్‌లెట్ల బదులు పండ్ల రసం ఎక్కించారు.. డెంగ్యూ పేషెంట్ మృతి!

October 21, 2022

 


ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లోని ఒక ఆసుపత్రిలో ప్లేట్‌లెట్లకు బదులు పళ్లరసం ఎక్కించడంతో ఓ రోగి ప్రాణాలు కోల్పోయారు. ప్రయాగ్‌రాజ్‌లోని బమ్రౌలీ నివాసి ప్రదీప్ పాండే అనారోగ్యంతో వారం క్రితం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అతడికి రిపోర్టులో డెంగ్యూ అని నిర్ధారణ అయింది. అతడి ప్లేట్‌లెట్స్ కౌంట్ భారీగా పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వైద్యులు బయట నుంచి ప్లేట్‌లెట్ల ప్యాకెట్‌’ తెప్పించి రోగికి ఎక్కించారు. ఒక్కసారిగా అతడి ఆరోగ్యం క్షీణించింది. తాము ఎక్కిస్తున్నది ప్లేట్‌లెట్స్ కాదని పళ్ల రసమని కాసేపటికి గుర్తించారు. రోగి కండిషన్ విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రదీప్ ప్రాణాలు నిలవలేదు.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో యూపీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ ఆదేశాలతో ఆ హాస్పిటల్‌ను సీల్ చేశారు. పేషెంట్ మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించింది. ‘కొన్ని అవకతవకలను గుర్తించాం. విచారణ పూర్తయ్యేంత వరకు హాస్పిటల్‌ను సీల్ చేశాం’ అని అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపినట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.

సీల్ చేసిన హాస్పిటల్ యజమాని మాట్లాడుతూ.. ప్లేట్‌లెట్లను తాము మరో వైద్య కేంద్రం నుంచి తెప్పించామని.. మూడు యూనిట్లు ఎక్కించాక పేషెంట్‌లో రియాక్షన్ వచ్చిందని తెలిపారు. ‘డెంగ్యూ పేషెంట్‌కు ప్లేట్‌లెట్లకు బదులు తీయటి పండ్లరసం ఎక్కించిన వైరల్ వీడియో మా దృష్టికి వచ్చింది. హాస్పిటల్‌ను సీల్ చేసి ప్లేట్‌లెట్ ప్యాకెట్లను పరీక్షల కోసం పంపించాం’ అని డిప్యూటీ సీఎం పాఠక్ ట్వీట్ చేశారు.