మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ జిందాల్ ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వర్గం నుంచి తన కుటుంబానికి హాని ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో తన కుటుంబానికి సంబంధించిన వివరాలను ఎవరూ బహిర్గతం చేయవద్దని కోరారు.
‘‘నా గురించి, నా కుటుంబం గురించి దయచేసి ఎవరూ ఎటువంటి వివరాలు ఎవరికీ చెప్పొద్దు. ఈ విషయంపై అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. చాలా మంది నా ఇంటి అడ్రస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇస్లామిక్ ఫండమెండలిస్ట్ల నుంచి నా ఫ్యామిలీకి ప్రమాదం పొంచి ఉంది’’ అని జిందాల్ ట్విటర్లో రాసుకొచ్చారు. తనకు కొంతమంది నుంచి బెదిరింపులు వచ్చినట్లు చెబుతూ కొన్ని స్క్రీన్షాట్లను జిందాల్ ట్విటర్లో షేర్ చేశారు.
మరోవైపు మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు గాను బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలు పలు చోట్ల హింసాత్మకంగా మారాయి.