ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ర్యాంక్ సాధించానని తెలిసి ఆ యువతి కుటుంబం సంబరాలు జరుపుకుంది. ఓ క్రేన్ ఆపరేటర్ కుమార్తెకు సివిల్స్ ర్యాంక్ వచ్చిందన్న వార్త తెలుసుకొని స్థానికులు, మీడియా సంస్థలు ఆమెను ప్రశంసలతో ముంచెత్తాయి. యువతి తండ్రి పనిచేసే కంపెనీ యాజమాన్యం ఆమెకు సన్మానం కూడా చేసింది. కానీ అంతలోనే వారి ఆనందం ఆవిరైంది. అసలు విషయం తెలుసుకొని, జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు.
అసలు ఏం జరిగిందంటే… జార్ఖండ్ రామ్‌గడ్‌కు చెందిన దివ్య పాండే(24).. 2017లో రాంచీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంది. సివిల్స్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూసింది. గతవారం యూపీఎస్సీ పరీక్ష ఫలితాలు వెలువడగానే ఉత్తరప్రదేశ్‌లో ఉండే దివ్య ఫ్రెండ్ ఒకరు ఆమెకు ఫోన్ చేసి సివిల్స్ పాసయ్యావని చెప్పారు. ఆల్ ఇండియా 323 ర్యాంక్ వచ్చిందని తెలిపారు. దీంతో దివ్య, ఆమె సోదరి కలిసి యూపీఎస్సీ వెబ్సైట్లో రిజల్ట్ చెక్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే సర్వర్, ఇంటర్నెట్ సమస్య కారణంగా ఎంతసేపటికీ ఆ వెబ్సైట్ రాలేదు. చెప్పింది తన స్నేహితురాలే కావడంతో ర్యాంక్ రావడం నిజమే అని దివ్య నమ్మి ఎంతో సంతోషపడింది.
ర్యాంక్ వచ్చింది తమ బిడ్డకే అనుకుని ఆ కుటుంబం కూడా సంబురాలు చేసుకుంది. స్థానికులకు స్వీట్లు పంచుకుంది. ఈ విషయం మీడియాకు సైతం చేరింది. దివ్య పాండే తండ్రి జగదీశ్ ప్రసాద్ పాండే 2016లో సెంట్రల్ కోలార్‌ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్) నుంచి క్రేన్ ఆపరేటర్‌గా రిటైర్ అయ్యాడు. దీంతో ఆ తండ్రి కష్టం ఫలించిందని అంతా అనుకున్నారు. విషయం తెలిసిన సీసీఎల్ అధికారులు, జిల్లా పాలనా సిబ్బంది దివ్య పాండేను పిలిపించుకుని ఘనంగా సత్కారం చేశారు.
అయితే కొద్ది రోజులకు యూపీఎస్సీ వెబ్సైట్లో దివ్య చెక్‌చేయగా అసలు విషయం తెలిసింది. తాను సివిల్స్ పాసవ్వలేదని, 323వ ర్యాంక్ సాధించిన దివ్య.పి దక్షిణాదికి చెందిన అమ్మాయి అని తెలిసింది. దీంతో ఆమె సంతోషం ఆవిరైంది. తమ పొరబాటును గ్రహించిన దివ్య కుటుంబం వెంటనే జిల్లా అధికారులు, సీసీఎల్ యాజమాన్యానికి క్షమాపణలు తెలిపింది.