కంటేనే అమ్మ అని అంటే ఎలా.. ప్రేమమూర్తులు ఈ పెంపుడు తల్లులు  - MicTv.in - Telugu News
mictv telugu

కంటేనే అమ్మ అని అంటే ఎలా.. ప్రేమమూర్తులు ఈ పెంపుడు తల్లులు 

May 8, 2020

అమ్మ గొప్పతనం అందరికీ తెలిసిందే. స్పందించే ప్రతి హృదయం తల్లి హృదయమే. అందుకు కనిపెంచాల్సిన అవసరం లేదు. మాతృత్వపు మమకారం ఉంటే చాలు. కన్నతల్లి కంటే ఎక్కవగా ప్రేమిస్తారు కనకనే ‘కన్నప్రేమకంటే పెంచిన ప్రేమ గొప్పది’ అని అంటారు.  పేగు తెంచుకు పుట్టకపోయినా బిడ్డలను అల్లారుముద్దుగా పెంచి చరిత్రలో నిలిచిపోయిన ఎందరో మహిళలను మదర్స్ డే తరఫున స్మరించుకుందాం. మనకు బాగా తెలిసిన యశోదాకృష్ణులనుంచి పెద్దగా తెలియని ప్రజాపతి గౌతమి వరకు ఎందరో పెంపుడు తల్లుల మమతానురాగాను గుర్తుచేసుకుంది. 

ప్రజాపతి గౌతమి

సత్యాన్వేషణ కోసం సర్వస్వాన్నీ త్యజించి సిద్ధార్థ గౌతముడిని పెంచిన పిన్ని ప్రజాపతి గౌతమి ఆదర్శ మాతృమూర్తి. ఆమె అతనికి ‘సవతి తల్లే’ అయినా కన్నబిడ్డకంటే ఎక్కువగా వాత్సల్యం చూపింది. సిద్ధార్థుడి తల్లి మాయాదేవి చనిపోయాక అతనికి పెద్దదిక్కయింది. విద్యాబుద్ధులు నేర్పి, సున్నిత స్వభావిని చేసింది. చివరకు సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాక అతని బాటలోనే తాను కూడా సన్యాస జీవితం స్వీకరించింది. ఆమె ప్రేమకు గుర్తుగా సిద్ధార్థుడు తన పేరులో ఆమె పేరును కూడా జోడించుకున్నాడు. 

యశోద.. 

చిన్నికృష్ణుడు తన బిడ్డే అని పెంచుకుంటుంది ఈ గోపవనిత. వాడి అల్లరికి మురిసిపోతుంది. కానీ పెద్దయ్యాక వాడు తన బిడ్డ కాదని తెలిసి విలవిల్లాడుతుంది. కంసవధ తర్వాత కథ మారిపోతుంది. కానీ కృష్ణుడు అనగానే దేవకి కాకుండా యశోదే గుర్తుకు వస్తుందటే ఆ ప్రేమమూర్తి గొప్పతనమే.

కుంతి

తన ముగ్గురు కొడుకులతోపాటు సవతి కొడుకులైన నకుల సహదేవులను వీరులుగా తీర్చిదిద్దింది. నిష్కల్మశ హృదయంలో పంచపాండవుల తల్లిగా ఘనకీర్తి సంపాదించుకుంది. మరో బిడ్డడైన కర్ణుడి కోసం ఆరాటపడింది. కుంతి లాంటి పాత్ర ప్రపంచ సాహిత్యంలో మరెక్కడా కనిపించదు. 

సూతపత్ని రాధ

నదిలో కొట్టుకొచ్చిన బిడ్డను అక్కున చేర్చుకున్న రాధ.. అతణ్ని వీరాధివీరుడిగా, మహాదాతగా, విశ్వాసపాత్రుడిగా తీర్చిదిద్దుతుంది. తన తల్లి రాధకాదని, కుంతి అని తెలుసుకున్న తర్వాత కూడా కర్ణుడు రాధేయసుతుడిగా ఉండడానికి ఇష్టపడతాడు. పాండవపక్షం చేరాలన్న కుంతి కోరికను తోసిపుచ్చుతాడు. భారత ఇతిహాసాల్లో, చరిత్రలోనే కాకుండా ప్రపంచమంతంటా ఇలాంటి గొప్పమనసున్న పెంపుడు తల్లులు ఎందరో ఉన్నారు.