మనదేశంలో తొలి మసీదు ఏది? తప్పకుండా చూడాల్సిన మరికొన్ని..  - MicTv.in - Telugu News
mictv telugu

మనదేశంలో తొలి మసీదు ఏది? తప్పకుండా చూడాల్సిన మరికొన్ని.. 

May 21, 2020

Famous mosques masjids in india

రంజాన్ పర్వదినం సమీపిస్తోంది. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉంటున్నారు. లాక్‌డౌన్ వల్ల కొంత సందడి తగ్గినా అతి పెద్ద పండగ ఉత్సాహం కనిపిస్తూనే ఉంది. సామూహిక ప్రార్థనలకు అనుమతి లేకపోవడంతో ఇళ్లలోనే నమాజ్ చేసుకుంటున్నారు. సర్వాంతర్యామి అయిన భగవంతుణ్ని వేడుకుంటున్నారు. ఇస్లాంలో విగ్రహారాధన లేకపోయినా ఖురాన్ సూక్తులున్న పటాలను పవిత్రంగా భావించి పూజ చేస్తుంటారు. మసీదును కూడా వైభవంగా నిర్మిస్తుంటారు. మరి ఈ రంజాన్ సందర్భంగా మనదేశంలోని ప్రముఖ మసీదులు వివరాలను తెలుసుకుందామా? 

 

కేరళో తొలిసారిగా.. 

ఇస్లాం తను పుట్టిన కొన్నేళ్లకే భారత్ చేరుకుంది. మొదట కేరళలో ప్రవేశించి తర్వాత ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. అందుకే మనదేశంలో తొలి మసీదుకు కేరళలోనే నిర్మితమైంది. త్రిస్సూర్ జిల్లాలోని కొడంగళూరులో క్రీ.శ. 629 ప్రాంతంలో దీన్ని నిర్మించారని చెబుతారు. చేరామన్ జామా పేరుతో ప్రసిద్ధికెక్కిన ఈ మందిరాన్ని మాలిక్ బిన్ దీనార్ అనే వ్యక్తి నిర్మించాడు. ప్రపంచంలో రెండో అతిపురాతన మసీదు కూడా ఇదే. 14వ శతాబ్దంలో వరదల్లో దెబ్బతినింది. తర్వాత చాలాసార్లు పునరుద్ధరించారు. ఇస్లామీయ వాస్తుకళతోపాటు హిందూ వాస్తు కూడా కనిపిస్తుంది. మక్కా నుంచి తెప్పించినట్లు భావించే ఒక పాలరాయి ఈ మసీదులో ఉంది.

 

ఢిల్లీ జామా మసీదు.. 

మనదేశంలో అతిపెద్ద మసీదు ఢిల్లీలోని జామా మసీదు. పాతిక వేల మంది ఇందులో ప్రార్థనలు చేసుకోవచ్చు. మొగల్ చక్రవర్తి షాజహాన్ 1664లో దీన్నినిర్మించాడు. మూడు గుమ్మటాల, 40 మీటర్ల ఎత్తయిన మీనార్లలో హిందూ, ఇస్లామీయ వాస్తుతో ఆకర్షణీయంగా ఉంటుంది. మసీదు పొడవు 80 మీటర్లు కాగా వెడల్పు 27 మీటర్లు. రంజాన్ ప్రార్థనలకు ఇది ప్రధాన వేదిక.

 

హైదరాబాద్ మక్కా మసీదు

హైదరాబాద్ అంటే చార్మినార్ తర్వాత వెంటనే గుర్తుకొచ్చేది ఇదే. పాతబస్తీలోని ఈ మందిరాన్ని కులీకుతుబ్ షా నిర్మించారు. పది వేల మంది ప్రార్థనలు చేసుకోడానికి వీలుదుంది. ప్రధాన మందిరం ఎత్తు 75 అడుగులు. నాలుగు మీనార్లు, ఐదు ద్వారాలతో సందర్శకులను అలరిస్తుంటుంది. 77 ఏళ్లపాటు 8 వేల మంది కార్మికులు దీన్ని కష్టపడి నిర్మించారు. మధ్య కమానుకు వాడిన ఇటుకలను మక్కా నుంచి తెప్పించారని ప్రతీతి. 

 

భోపాల్ తాజుల్ మసీదు

తాజుల్ మసీదు అంటే మసీదుల్లో తలమానికం అని అర్థం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దీన్ని నవాజ్ షాజహాన్ బేగం 19వ శతాబ్డిలో నిర్మించారు. ఆసియాలో అత్యత ఎత్తయిన మసీదుల్లోఇది ఒకటి. 

 

లక్నో బారా ఇమాంబరా మసీదు

అవధ్ నవాబ్ అసఫఉద్దౌలా నిర్మించాడు. 1784లో నిర్మాణం పూర్తయింది. బాల్కనీలు, చిన్నచిన్న గుమ్మటాలతో కనువిందుగా ఉంటుంది. ఎలాంటి రాతి స్తంభాల ఆసరా లేకుండా చిన్నచిన్న ఇటుకలు, గచ్చుతో దీన్నినిర్మించారు. కలప, లోహాలను కూడా వాడలేదు. 

 

అజ్మీర్ జామా మసీదు

మొగల్ కాలంనాటి పాలరాతి కట్టడం ఇది. ప్రార్థనలకే కాకుండా పర్యాటకానికి కూడా పేరొందింది. రాజస్తాన్‌లోని అజ్మీర్ లోని 1638లో నిర్మించారు. మేవార్ రాజులపై విజయానికి గుర్తుగా దీన్ని కట్టించారు. 45 మీటర్ల పొడవున్న మసీదులో 11 కమాన్లు ఉన్నాయి. ప్రార్థనలు చేసుకునే హాలు నక్షత్రాకారంలో ఉంటుంది. 

కశ్మీర్ హజ్రత్ బల్ మసీదు

అందమైన కశ్మీరులో అందమైన మందిరం ఇది. దాల్ సరస్సు ఎడవ ఒడ్డున నిర్మించారు. 25 మీటర్ల ఎత్తు 154 మీటర్ల పొడవుతో మంచుకొండలా మెరిసిపోతూ ఉంటుంది. సలాలాహు అలాహీ వసాల్లామ్ అనే మతబోధకుడి శిరోజాలు ఇందులో ఉన్నాయి. మసీదు ప్రతిబింబం దాల్ సరస్సులో పడుతున్న దృశ్యాన్ని చాలా బావుంటుంది.