సోనూసూద్ మొబైల్ స్టోర్.. ఫ్రీ రీచార్జ్ కోసం నటుడి రిక్వెస్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

సోనూసూద్ మొబైల్ స్టోర్.. ఫ్రీ రీచార్జ్ కోసం నటుడి రిక్వెస్ట్ 

October 24, 2020

తన సినిమాలు చూసి ఆదరించిన ప్రేక్షకుల రుణం తీర్చుకున్న నటుడిగా ఒక్క సోనూసూదే నిలుస్తాడు. నటుడిగా తనను ఆదరించిన ప్రేక్షకులు కరోనా కష్టకాలంలో ఉన్నారని వారిని ఆదుకున్నాడు. లాక్‌డౌన్ సమయం నుంచి ఇప్పటివరకు సోనూ ప్రజలకు చేస్తున్న సేవలు అనన్య సామాన్యమైనవి. ప్రజల గుండెల్లో దేవుడు అయ్యాడు. ఇంత చేస్తున్న సోనూ తన ఫోన్‌కు ఫ్రీ రీచార్జ్‌ చేయాలని సోషల్ మీడియాలో కోరుతున్నాడు. ఎందుకో తెలుసా.. ఓ మొబైల్‌ షాప్‌ యజమాని తన మొబైల్ స్టోర్‌కు సోనూసూద్ పేరు పెట్టుకున్నాడు. పక్కనే సోనూ ఫోటో కూడా పెట్టాడు. దాని గురించి తెలుసుకున్న సోనూ ‘మీరు నా మొబైల్‌కు ఫ్రీగా రీచార్జ్‌ చేస్తారా?’ అని తమాషాగా ప్రశ్నిస్తూ ఆ ఫోటోను తన ట్విటర్‌లో పంచుకున్నాడు. ఆ ఫోటోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎందరికో మంచి చేసిన సోనూ పేరును చిరస్థాయిగా నిలిచేలా చేయాలని కోరుతున్నారు. 

కాగా, కరోనా సమయంలో ఫ్రంట్‌‌లైన్‌ వారియర్స్‌కు తగిన వసతులను ఏర్పాటు చేసిన సోనూసూద్‌ తర్వాత పేదలకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వలస  కూలీలను వారి స్వస్థలాలకు చేరేలా తగు జాగ్రత్తలు తీసుకుని రియల్‌ హీరో అనిపించుకున్నాడు. ఈ క్రమంలో ప్రజలు సోనూసూద్‌పై తమకు తోచిన రీతిలో అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. కొందరు తమ పిల్లలకు సోనూసూద్‌ పేరు పెట్టుకుంటున్నారు. మరికొందరు సోనూ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు.