fans Anger over not playing spinner Chahal against England in the semis match
mictv telugu

సెమీస్‌లో టీమిండియా చేసిన అతిపెద్ద తప్పిదం ఇదే..

November 10, 2022

fans Anger over not playing spinner Chahal against England in the semis match

రెండో సెమీస్ మ్యాచులో ఇంగ్లండుపై గెలిచి ఆదివారం దాయాదితో ఉత్కంఠభరిత పోరుకు సిద్ధమవుతున్న అభిమానులకు టీమిండియా ప్రదర్శన శరాఘాతంగా మారింది. మొదట బ్యాటింగులో తడబడినా.. తర్వాత బౌలింగులో పూర్తిగా తేలిపోవడంతో దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బౌలర్ల ఘోర ప్రదర్శనతో ఒక్క వికెట్టు కూడా తీయకుండానే టోర్నీ నుంచి అవమానకరంగా నిష్క్రమించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఊది పడేశారు. బౌలర్ ఎవరనేదానితో సంబంధం లేకుండా బంతిని బౌండరీలకు తరలించారు.

అయితే కీలకమైన ఈ మ్యాచులో ఇండియా ఓ తప్పు చేసిందని నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్షర్ పటేల్ స్థానంలో రిస్ట్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌‌ని ఆడించి ఉంటే గెలిచేవారమని చెప్తున్నారు. ఇంగ్లండ్ రిస్ట్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఈ మ్యాచులో నాలుగు ఓవర్లు వేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన సూర్యకుమార్ యాదవ్ వికెట్ పడగొట్టాడు. మరో స్పిన్నర్ లివింగ్ స్టోన్ మూడు ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. కానీ, ఇదే పిచ్‌‌పై మన స్పిన్నర్లు మాత్రం తేలిపోయారు. అక్షర్, అశ్విన్‌‌లను తుది జట్టులోకి తీసుకొని మూల్యం చెల్లించారని వాపోతున్నారు. బ్యాటింగ్ కూడా చేస్తాడని అశ్విన్‌‌ని, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అనే ఉద్దేశంతో అక్షర్ పటేల్‌‌ను తీసుకున్నారు కానీ అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదని విమర్శిస్తున్నారు. అదిల్ రషీద్, జంపా, హసరంగ, రషీద్ ఖాన్ వంటి రిస్ట్ స్పిన్నర్లు టోర్నీలో అద్భుతంగా రాణిస్తుంటే భారత్ మాత్రం చాహల్‌‌ను ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. గత టీ20 ప్రపంక కప్‌‌లో చాహల్‌ను ఎంపిక చేయలేదు, ఈ సారి ఎంపిక చేసినా బెంచ్‌కే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెమీస్‌‌లో చాహల్‌‌ను ఆడించకపోవడంతోనే భారత్ విజయావకాశాలను కోల్పోయిందని స్పష్టం చేస్తున్నారు.