ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీం కోర్టులోనూ తెలంగాణ సర్కారకు నిరాశ ఎదురైంది. సీబీఐ విచారణ ముందుకు సాగకుండా యథాతథ స్థితి కొనసాగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిని సర్వోన్న న్యాయస్థానం తోసిపుచ్చింది. పిటిషన్ పై ఈ నెల 17న సమగ్ర విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ వై చంద్రచూడ్ స్పష్టం చేశారు. కేసును సీబీఐకి అప్పగించడానికి సవాలు చేస్తూ విచారణపై తక్షణం స్టే ఇవ్వాలని ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టేయడంతో పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరింది.
హైకోర్టు తీర్పుపై అత్యవసర విచారణ జరపాలన్న సర్కారు విజ్ఞప్తిని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. కేసు ఫైళ్లు తమకు కావాలంటూ సీబీఐ తమపై ఒత్తిడి తెస్తోందని ప్రభుత్వం తెలిపింది. ఫైళ్లు దర్యాప్తు సంస్థ చేతిలోకి వెళ్తే కేసు నీరుగారుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేసు చాలా తీవ్రమైందని, 17 కాకుండా అంతకు ముందే విచారణ జరపాలని కోరింది. కోర్టు అందుకు నిరాకరిస్తూ, ఈ కేసులో ప్రభుత్వ వాదనల్లో బలం ఉంటే హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తామని పేర్కొంది. బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బీజేపీ తరఫున రామచంద్ర భారతి తదితర నలుగురు నిందితులు ఫామ్ హౌస్‌లో భేటీ అయ్యారని, దీని వెనక ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర ఉందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. నిజానిజాలు బయటికి రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.