Farm Sathi has invented the robot weeder
mictv telugu

కలుపు తీసే రోబో కూలీ.. 2 నెలల్లో రైతులకు అందుబాటులో

November 9, 2022

Farm Sathi has invented the robot weeder

వ్యవసాయంలో రైతులు ఎదుర్కొనే ప్రధానమైన కలుపు సమస్యకు ఇప్పుడు సరికొత్త పరిష్కారం వచ్చేసింది. అధిక పెట్టుబడులకు కారణమవుతున్న కలుపు కూలీల సమస్యను తీర్చడానికి రోబో ఎంట్రీ ఇచ్చింది. ‘ఫామ్ సాథీ’ అనే స్టార్టప్ కంపెనీ ఈ రోబోను కనిపెట్టింది. పవర్ చార్జర్, బ్యాటరీల సాయంతో పని చేసే ఈ రోబోలతో రైతులకు ఆర్ధిక భారం తగ్గుతుందని సంస్థ సీఈఓ సుశాంత్ చెప్తున్నారు. ఈ రోబో పొలాల్లోని తుంగ, గరికతో పాటు ప్రమాదకరమైన వయ్యారిభామ మొక్కలను సైతం పీకేస్తుంది.

మిల్లీమీటరు సైజులో ఉన్న మొక్కను కూడా గుర్తించగలగడం ఈ రోబో ప్రత్యేకత. ఇటీవల హైదరాబాదులోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో బత్తాయి, బొప్పాయి తోటలలో పరీక్షించి చూడగా, పంటను వదిలేసి కలుపు మొక్కలను విజయవంతంగా నిర్మూలించిందని సుశాంత్ వెల్లడించారు. రానున్న రోజుల్లో వ్యవసాయం డిజిటల్ అయిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి రోబోలు అత్యవసరమని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. 20 మంది కూలీలు చేసే పనిని ఈ రోబో చేస్తుందని, రైతులకు కష్టం లేకుండా కంపెనీ ప్రతినిధులే రోబోతో పొలానికి వచ్చి కలుపు తీస్తారని చెప్తున్నారు. ఇందుకోసం రైతులతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. వ్యవసాయాన్ని వ్యాపారంగా చూసే ధోరణి పెరుగుతోందని, ఈ క్రమంలో ఈ రోబోను రెండు నెలల్లో రైతులకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ వారు వెల్లడిస్తున్నారు.