ఎమ్మార్వో చెంతకు ‘పెట్రోల్’ రైతు.. బండిలో పోసుకోడానికిలే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మార్వో చెంతకు ‘పెట్రోల్’ రైతు.. బండిలో పోసుకోడానికిలే..

November 9, 2019

పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా తయారైంది రెవెన్యూ అధికారుల పరిస్థితి. పెట్రోలు డబ్బా చేతిలో కనిపిస్తే చాలు గజగజా వణికిపోతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి తహశీల్దార్ ఆఫీసులో ఇలాంటి ఘటనే జరిగింది. పనిమీద మండల కార్యాలయానికి వచ్చిన ఓ రైతును చూసి గజగజా వణికిపోయారు అధికారులు.

 రామన్నపల్లె గ్రామానికి చెందిన పన్యాల చంద్రయ్య, బద్దనపెల్లికి చెందిన నర్సింహారెడ్డి వద్ద 29 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. దీన్ని చంద్రయ్య తన భార్య లింగవ్వ పేరుమీద రిజిష్టర్ చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయమై ఎమ్మార్వో ఆఫీసులో ఆరా తీసేందుకు వచ్చాడు. ఆ సమయంలో అతని చేతిలో పెట్రోలు డబ్బా కనిపించడంతో దూరం నుంచే గమనించిన ఆర్ఐ సంతోష్ పరుగు పరుగున వచ్చి విషయం ఏంటని.. పెట్రోల్ డబ్బా దేనికంటూ అడిగిగాడు. అప్పుడు ఆ రైతు చెప్పిన మాటలు విని ఊపిరి పీల్చుకున్నారు. 

MRO Office.

చంద్రయ్యకు ఎప్పుడైనా సిరిసిల్ల నుంచి పెట్రోల్ తీసుకెళ్తుండటం అలవాటు. మోటార్ సైకిల్ కోసం దాన్ని తీసుకెళ్తుంటాడు. ఈ సారి కూడా బండికోసమే పోయించుకున్నాడు. పెట్రోల్ను  సీసాలో పోయించుకొని ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆగాడు. పట్టా మార్పిడి కోసం సంతకం పెట్టేందుకు తన భార్యను ఎప్పుడు తీసుకురావాలంటూ అడిగేందుకు వచ్చాడు. ఆ సమయంలో అతని చేతిలో పెట్రోలు డబ్బా చూసి అధికారులు వణికిపోయారు. విషయం తెలిసిన అధికారులు అతనికి సమాచారం అందించి అక్కడి నుంచి పంపించేశారు. ఈ విషయం తెలిసిన వారంతా అధికారుల తీరుపై వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు. కాగా ఎమ్మార్వో విజయారెడ్డిని సజీవ దహనం చేసిన తర్వాత రెవెన్యూ సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు బాహాటంగానే అధికారులను నిలదీస్తున్నారు.