నా చావుకు కారణం మోదీనే.. రైతు సూసైడ్ నోట్ - MicTv.in - Telugu News
mictv telugu

నా చావుకు కారణం మోదీనే.. రైతు సూసైడ్ నోట్

April 11, 2018

దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్ల పదిమందికి తిండిపెట్టే  అన్నదాతల నిండు ప్రాణాలు బలవుతున్నాయి. అప్పుల బాధ భరించలేక మహారాష్ట్రలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలే కారణమని తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

యవత్మల్ జిల్లా రాజుర్వాడి గ్రామానికి చెందిన శంకర్‌ భావూరావ్ చైరే(50) సాగు కోసం సహకార సొసైటీ వద్ద రూ.90 వేలు, వడ్డీ వ్యాపారి వద్ద రూ.3 లక్షలు అప్పు చేశాడు. పత్తి పంట సాగు చేశాడు. తెగులు వల్ల పంటపూర్తిగా దెబ్బతింది. శంకర్ పంటనే కాకుండా విదర్భ ప్రాంతంలో చాలాచోట్ల పంటలు పోయాయి. ప్రభుత్వం రుణమాఫీ కూడా ప్రకటించింది. అయితే బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకే అది వర్తిస్తుంది. శంకర్ సొసైటీ నుంచి తీసుకున్న రూ. 90 వేల అప్పు మాఫీ అయింది కానీ వ్యాపారి వద్ద తీసుకున్న రూ. 3 లక్షల అప్పు అలాగే ఉంది. పెళ్లి కావాల్సిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కొడుకు చదువుకుంటున్నాడు.

ఈ రుణాన్ని తీర్చడం తన వల్ల కాదని శంకర్ భావించాడు. బ్యాంకులు తనకు అప్పు ఇచ్చిఉంటే వడ్డీవ్యాపారి వద్దకు వెళ్లే అవసరం ఉండేది కాదని మిత్రులతో చెబుతుండే వాడు. దీనికంతటికీ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వమే కారణమని పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి పొలంలోనే స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. ఓ స్థానిక స్వచ్ఛంద సంస్థ శంకర్ కుటుంబానికి రూ. లక్ష సాయం చేసింది.