ఈళ్లకు విజయ్ మాల్యానే కరెక్టు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈళ్లకు విజయ్ మాల్యానే కరెక్టు..!

June 30, 2017

నీరు నీరు నీరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు…అని సిన్మలల్ల పాటలస్తే కన్నీళ్లు వెట్కుంటంకనీ..నిజంగ ఆళ‌్ళను పట్టించుకునెటోళ్లేలేరు,అప్పో సొప్పో జేశి ఉన్న పొలంల ఏమన్న పండించుకుందామంటే..అటు సావుకారి అప్పియ్యడు ఇటు బ్యాంకులల్ల లోన్ తీస్కుందామంటే..షూరిటీ ఏం బెడ్తవ్..టైం కడ్తవా,ఇప్పుడైతె లేవ్ మల్లా వారం రాపో అని కాళ‌్లకున్న శెప్పులర్గెదాక తిప్పించుకుంటరు బ్యాంకోళ్లు.అగో అన్నదాత అంటే గంత చిన్న సూపు ఎవ్వలికైనా.ఒకవేళ అప్పోసొప్పో జేశి పోలంల ఏదన్న ఏస్తే…ఆఖర్కి పంటశేతికచ్చెదాక నమ్మకం తక్కొనే రైతుకు,ఎందుకంటే ఇటు మన్షులే గాదు ఒగోపారి ప్రకృతి కూడ కన్నెర్ర జేస్తది రైతుల మీద,భగవంతుని దయతోని పంటశేతికచ్చిందే అనుకో…నడిమిట్ల దళారీగాళ్ల దగాలు,గిట్టుబాటులేని ధరలు…ఇట్ల అన్ని కల్శి రైతు ఉసురు వోస్కుంటయ్,పంటకోసం తెచ్చిన అప్పులు కట్టలేక..పెళ్ళాం బిడ్డల్నుఎట్ల సాదాల్నో తెల్వక  జీవిదీస్కున్న రైతులెందరో.

బ్యాంకులో రైతు ఆత్మహత్యాయత్నం

జగిత్యాల జిల్లా ఇస్త్రాజ్ పల్లి గ్రామంకు చెందిన  చంద్రయ్య అనే రైతు..పంటను అమ్మితే అచ్చిన లచ్చా ఎన్బైవేల రూపాల్ను బ్యాంకులకేలి తీద్దామని గొల్లపల్లిలున్న ఓ బ్యాంకుకు పొయ్యిండట,కనీ బ్యాంకోళ్లు ఏ అట్లెట్లిస్తం, గ రోజు గ రైతు ట్రాక్టర్ కొంటా అంటే లోన్ ఇచ్చినమ్,జమానాతు సంతకం నువ్వే వెడ్తెవి,ఆయన లోను కడ్తనే నీ పైసలిస్తం అని జిజ్జు పట్టు పట్టిన్రట,అది గాదు సారు అవుతల అప్పు కట్టాలే, పైసలు మస్తు అవుస్రమున్నయ్ అన్నాగుడ,ఓ గిసొంటియ్ మస్తు జూశ‌్నం,ఇయ్యం ఇయ్యం అని అన్నరట బ్యాంకోళ‌్ళు,మా రైతుల బాదలు ఇంకెప్పుడు తెల్సుకంటరయ్య కనీసం నేను సచ్చినంకనన్న తెల్సుకోన్రి అని పురుగుల మందు డబ్బిప్పి తాగవోయిండు చంద్రయ్య, ఆడున్నోళ‌్లు  మన్షికో దిక్కు ఆపెవర్కు ఇంకేం గాలె నయం,ఓర్నియవ్వ ఇదెక్కడి కతరో అని యాబైవేలు వట్కోని మిగతా పైసల్ను ఇచ్చిన్రట బ్యాంకోళ్లు,

అవుగనీ బ్యాంకుసార్లు మీకో ముచ్చట అడ్గాలే…..

విజయ్ మాల్యాగాడు వేలకోట్లు తీస్కున్నప్పుడు మరి షూరిటీ ఎవల్ని వెట్కున్నరు,ఆడేమో ముంచి మంచిగ దేశాలు దిర్గుకుంట  క్రికెట్ మ్యాచ్ లు సూస్కుంట,పబ్బులు డిస్కోలని ఎంజాయ్ జేస్తుండు,గాన్ని వట్కునుడు మీతోని గాలేదు,కనీసం మరి వాన్కి షూరిటీ ఎవ్వలు వెట్టిన్రో గాళ్లను గుడ గట్టిగ వట్కొని గా విజయ్ మాల్యా పైసలు గడ్తెనే మీ ఖాతలల్ల పైసలిస్తమని శెప్పెదుంటిరి,అసలు షూరిటీ వెట్కున్రా లేక ఏ మనోడే ఏడికోతడు అని ఉత్తగనే ముట్టజేప్పిన్రా,అదే మా అసొంటి సామాన్య పబ్లిక్కు లోన్ కట్టుడు జర్ర ఆల్శమైతే..ఇంటికి తాళమేస్తరు,ఇంట్ల సామాను తీస్కవోతరు,నడి బజార్ల ఇజ్జత్ దీస్తరు,కోట్ల అప్పులు తీస్కునోళ‌్లే మన్షులు కనీ…మేం మన్షులం గాదా సారు…ఎందుకు సారు మేమంటే మీకంత చిన్న సూపు,అయినా మీ బ్యాంకోళ‌్లకు ఆ విజయమాల్యాగాడసొంటేడే కరెక్టు సారు…కోటు బూట్లు ఏస్కోనచ్చి తియ్యగ మాట్లాడితే  వేల కోట్లైనా ఇస్తరు, మేమేమో అయ్యా మీ బాంచెన్ ఇట్ల ఇట్ల పరిస్ధితి అన్న జెప్పినా కనికరం జూపెట్టరు…గీదేం న్యాయమో మీకే దెల్వాలె సారు అని అంటున్రు బ్యాంకు బాధితులైన రైతులు.