రైతులకు చిల్లర చెక్కులు.. సర్కారు పరిహాసం.. - MicTv.in - Telugu News
mictv telugu

రైతులకు చిల్లర చెక్కులు.. సర్కారు పరిహాసం..

March 22, 2018

మన రాజకీయ నాయకులు పొద్దున పళ్లు తోముకుని మాట్లాడతారో లేదోగాని ప్రతి ఒక్కరూ రైతులు అన్నదాతలని, వారిని ఉద్ధరిస్తామని చెప్పేవారే. వారు దేశానికి వెన్నెముకలని, తాము ఆసరా ఇచ్చి మరింత నిటారుగా నిలబెడతామని వల్లించేవారే. అయితే ఆచరణలో మాత్రం అదంతా పొల్లులా తేలిపోతోంది. కష్టాల సుడిగుండాల్లో ఉండాల్సిన రైతులను ఆదుకోవాల్సి పోయి పుండుమీద కారం చల్లింది తమిళనాడు సర్కారు.

రైతులకు పంటనష్టం పరిహారం కింద 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల చెక్కులను ఏదో దానధర్మం అన్నట్లు రాసిచ్చింది. ఏదో పొరపాటుతో కాదు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో పలుచోట్ల వందలాది ఇలాంటి చెక్కులిచ్చారు. విపక్ష డీఎంకే ఎమ్మెల్యే పిచ్చాంది వీటిని బుధవారం అసెంబ్లీలో ప్రదర్శించారు. ఇదేనా రైతులకు ఇచ్చే గౌరవం, సాయం అని దుయ్యబట్టారు. ‘చెక్కులను మార్చుకోవడానికి బ్యాంకు ఖాతా తెరవాలంటే రూ. 500 చెల్లించాల్సి ఉంది. మరలాంటప్పుడు ఈ చిల్లర చెక్కులు దేనికి పనికొస్తాయి? ’ అని నిలదీశారు. దీంతో ప్రభుత్వం లెంపలు వేసుకుంది. పంటనష్ట పరిహార పథకంలో అవకతవకలు జరిగిన మాట నిజమేనని, ఇలాంటి వాటిని పునరావృతం కానివ్వకుండా చూస్తామని హామీ ఇచ్చింది.