లక్షమంది రైతుల లాంగ్ మార్చ్.. పాలకుల గుండెల్లో రైళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

లక్షమంది రైతుల లాంగ్ మార్చ్.. పాలకుల గుండెల్లో రైళ్లు

March 8, 2018

 అప్పులు, కరువు, దళారులు మోసాలు, గిట్టుబాటు ధరల లేమి.. ఇంకా ఎన్నెన్నో సమస్యలతో కుదేలవుతున్న అన్నదాతలు కన్నెర్రజేశారు. పికిడిలి బిగించారు. లక్షమంది రైతులు కనీవినీ లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. సర్కారు మెడలు వంచి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కదం తొక్కుతున్నారు. ఈ లాంగ్ మార్చ్ బుధవారం మధ్యాహ్నం మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో మొదలైంది.

పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు సహా లక్షమంది రైతులు, రైతు కూలీలు నడుస్తున్నారు. 180 కి.మీ. సాగే యాత్ర ఈ నెల 12 దేశ ఆర్థిక రాజధాని ముంబైని ముట్టిడిస్తుంది. అసెంబ్లీ ఎదుట నిలిచి తాము ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు వివరిస్తారు. రైతులు చీమల దండులా కదలి వస్తుండంతో దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలో బీజేపీ సర్కారు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పోలీసులను ఉసిగొల్పి రైతులను అడ్డుకుంటే మరింత చెడ్డపేరొస్తుందని నాయకులు భయపడుతున్నారు. అయితే కర్షకులు ముంబై చేరుకుంటే పరిస్థితి మరింత ముదిరి, తమ చేతకానితనం లోకానికి తెలుస్తుందని గింజుకుంటున్నారు.

రోడ్లపైనే వంట, నిద్ర

లాంగ్ మార్చ్‌లో పాల్గొంటున్న రైతులు రాత్రిపూట రోడ్లమీదే నిద్రిస్తున్నారు. వంటను కూడా రోడ్డుపక్కే చేసుకుంటున్నారు. ఎవరినీ పైసా అడక్కుండా తాము తెచ్చుకున్న తిండిగింజలతోనే కడుపు నింపుకుంటూ ముందుకు సాగుతున్నారు. మార్చ్ ఇంత తీవ్రంగా సాగుతున్న దీనిపై జాతీయ మీడియాలో పెద్దగా వార్తలు రావడం లేదు. అఖిల్ భారతీయ కిసాన్ సభ దీనికి సారథ్యం వహిస్తోంది. ఇతర వామపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి.