రైతులు గెలిచారు.. దిగొచ్చిన మహా సర్కారు... - MicTv.in - Telugu News
mictv telugu

రైతులు గెలిచారు.. దిగొచ్చిన మహా సర్కారు…

March 12, 2018

వారం రోజులుగా పల్లెలు, అడవులు, పేటలు, పట్టణాల మీదుగా కదం తొక్కిన అన్నదాతులు గెలిచారు. రుణమాఫీ, గిట్టుబాటు ధరల పెంపు వంటి డిమాండ్ల సాధన కోసం వారు నిర్వహించిన పాదయాత్ర ధాటికి మహారాష్ట్ర సర్కారు దిగివచ్చింది. వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. దీంతో అర లక్ష మందికిపైగా రైతులు ముంబై మహానగరాన్ని వీడి మళ్లీ పల్లెబాటలు పడుతున్నారు.
లాంగ్‌మార్చ్ పేరుతో రైతులు నాసిక్ నుంచి వారం కింద రాష్ట్ర రాజధాని ముంబైకి పాదయాత్ర ప్రారంభించడం తెలిసిందే. 180 కి.మీ. సాగిన యాత్ర సోమవారం ఉదయం ముంబై చేరుకుంది. నగర ప్రజలు వారికి చాయ్, బిస్కెట్, ఇతర అల్పా హారాలు అందించి అండగా నిల్చారు. శివసేన, కాంగ్రెస్, ఇతర విపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి. తర్వాత రైతులు ఆజాద్ మైదాన్ చేరుకున్నారు. రైతులను అడ్డుకుంటే చెడ్డపేరొస్తుందనే భయంతో ఫడ్నవిస్ సారథ్యంలోని బీజేపీ సర్కారు మౌనంగా ఉండిపోయింది. వారికి భద్రత కల్పిస్తూ సహకరించింది కూడా.

యాత్ర ముంబై చేరుకున్నాక సీఎం.. రైతులతో చర్చలు కోసం తన సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. చర్చల తర్వాత సీఎం ప్రకటన చేశారు. రైతాంగ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, పంటలకు పెట్టుబడితో పోలిస్తే 1.5 రెట్లు ఎక్కువగా గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక కుటుంబానికి రూ. 1.5లక్షల రుణాన్ని మాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రైతు కుటుంబాలకు వెంటనే రేషన్ కార్డులు ఇస్తామన్నారు. దాదాపు అన్ని డిమాండ్లను నెరవేర్చడానికి అంగీకరించామని తెలిపారు.

చర్చలు ముగిశాక రైతులు ఆజాద్ మైదాన్ లో సదస్సు నిర్వహిస్తున్నారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులు హాజరయ్యారు. యాత్ర ముగియడంతో నడిచినడిచి అలసిపోయిన రైతులును తిరిగి వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం రెండు ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేసింది.