ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి వారం ముందు నుంచే సిరిసిల్ల జిల్లా రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. ఇటీవల సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఇక్కడి రైతుల విజ్ఞప్తి మేరకు వారం రోజుల ముం దుగానే రైతు బంధును అందిస్తున్నారు. ఈనెల 21 నుంచే రైతులకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఆర్బీఐ హైదరాబాద్ నుంచి నెఫ్ట్ ద్వారా ఖాతాల్లోకి జమ చేస్తుండగా, జిల్లాలోని రైతులు, ప్రజాప్రతినిధులు, నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
2022 యాసంగి సీజన్లో జిల్లాలో మొత్తం 1,28,361 మంది రైతులకు రూ.130.08 కోట్లు చెల్లిస్తున్నారు. యాసంగి సాగుకు సిద్ధమవుతున్న తరుణంలోనే పెట్టుబడి సాయం అందడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముందుగానే అకౌంట్లలో డబ్బులు పడడంతో.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు సంబురాలు జరుపుకుంటున్నారు. మరోవైపు జిల్లాలో ఈ నెల 24న సెస్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వం వారం ముందుగా రైతుల ఖాతాల్లో రైతుబంధును జమ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.