ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్ దగ్ధం.. నిరసన స్వరం పెంచిన రైతులు  - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్ దగ్ధం.. నిరసన స్వరం పెంచిన రైతులు 

September 28, 2020

unhbg

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టంపై పలు రాష్ట్రాల్లో నిరసనలు పెరిగిపోతున్నాయి. రైతులు ట్రాక్టర్ ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఈ సెగ తగిలింది. కొంత మంది రైతులు ఇండియా గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం 7.15 గంటల సమయంలోనే అక్కడికి ట్రాక్టర్లతో చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఓ ట్రాక్టర్‌కు నిప్పు పెట్టి నినాదాలతో హోరెత్తించారు. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. నిత్యం నిఘా పటిష్టంగా ఉండే ప్రాంతంలో ఈ సంఘటన జరగడం సంచలనంగా మారింది. 

ఇండియా గేట్ వద్దకు  20 మంది రైతులు చేరుకున్నారు. అక్కడే కూర్చుని ధర్నాకు దిగారు. చేతిలో భగత్ సింగ్ చిత్ర పటాన్ని పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ట్రాక్టర్‌కు నిప్పు పెట్టారు. తమను కొత్త చట్టంతో పూర్తిగా మోసం చేస్తున్నారంటూ వాపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించారు. ఫైర్ ఇంజన్ తెచ్చి మంటలను ఆర్పేశారు. అప్పటికే అది పూర్తిగా కాలిపోయింది. మరోవైపు పంజాబ్‌లోనూ నిరసనలు పెరిగాయి. అమృత సర్ – న్యూఢిల్లీ రైల్వే ట్రాక్ పైకి చేరుకున్న వందలాది మంది రైతులు, ధర్నాకు దిగారు. కాగా ఈ బిల్లుకు రాష్ట్రపతి నిన్న ఆమోదముద్ర వేయడంతో చట్టంగా మారిన సంగతి తెలిసిందే.