భూసేకరణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన 80ఎ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం కదం తొక్కారు. హన్మకొండ – హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల భూములు తీసుకొని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నిరసనలో కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు పాల్గొనడంతో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు జాతీయ రహదారి దిగ్భంధనానికి పిలుపునివ్వడంతో అనేక చోట్ల రైతులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా చాలా మంది రైతులు రోడ్డెక్కడంతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, వరంగల్ నగరం చుట్టూ ఔటర్ రింగురోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చేయడానికి ప్రభుత్వం జీవో 80ఎను జారీ చేసింది. జీవో ప్రకారం 27 గ్రామాల నుంచి 21,510 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ గ్రామాలు ఉన్నాయి. దీంతో భూములు కోల్పోతున్న రైతులు నిరసనలో పాల్గొన్నారు.