వందో రోజున బట్టలు విప్పేస్తాం.. - MicTv.in - Telugu News
mictv telugu

వందో రోజున బట్టలు విప్పేస్తాం..

September 9, 2017

కరువు, అప్పులతో తల్లడిల్లుతున్న తమిళనాడు రైతుల మొర వినే నాథుడే కరువయ్యారు. దేశ రాజధాని హస్తినలో వందలాది తమిళ రైతులు రెండో విడతలో భాగంగా గత 56 రోజులుగా నిరసన తెలుపుతున్నా మోదీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. తమను ఆదుకోవాలని, సాగుకు నీరివ్వాలని అధికారులకు ఎన్ని వినతి పత్రాలిస్తున్నా ఫలితం  లేకపోతోంది. మరోపక్క రాజకీయ అస్థిరతతో కునారిల్లుతున్న తమిళనాడులోని పళనిస్వామి సర్కారుకు రైతుల కడగండ్లను పట్టించుకునే ఓపిక లేదు. ప్రభుత్వాల ఈ దుర్మార్గమైన నిర్లక్ష్యానికి నిరసనగా తన నిరసన వందో రోజున పూర్తిగా బట్టలు విప్పేసి రోడ్లపైకి వస్తామని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న తమిళ రైతులు హెచ్చరించాలరు.

ఈ రైతులు ఇదివరకు ఆత్మహత్య చేసుకున్న రైతులు పుర్రెలతో వినూత్న నిరసన తెలిపాయి. కొందరు రైతులైతే పార్లమెంటు వద్ద అర్ధనగ్నంగా, నగ్నంగా పరిగెత్తి తోలుమందం సర్కారును మేల్కొలపడానికి యత్నించారు. మరోసారి గుండ్లు గీయించుకుని, పచ్చిగడ్డి, ఎలుకలు తిని, నోటికి నల్లగుడ్డలు కట్టుకుని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో వారు మరింత తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. వీరిలో పలువురు మహిళలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు చెప్పింది చేస్తే ప్రభుత్వాలు తీవ్ర విమర్శలు ఎదుర్కొనాల్సి ఉంటుంది.