ట్రక్కులు ఢీకొని ఆరుగురు రైతుల మృతి
ఉత్తర్ప్రదేశ్లో రోడ్డు ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. గడిచిన వారం రోజులుగా పెద్ద సంఖ్యల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటనలో ఆరుగురు రైతులు మరణించారు, మరో రైతు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఇటావా నగరంలో చోటు చేసుకుంది. రైతులంతా పనస పండ్లను విక్రయించేందుకు ట్రక్కులో మార్కెట్‌కు వెళ్తుండగా ఇది చోటు చేసుకుంది. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
బుధవారం తెల్లవారుజామున కొంత మంది రైతులు పనస పళ్లు అమ్మేందుకు ట్రక్కులో బయలుదేరారు. ఈ క్రమంలో వారు వెళ్తున్న వాహనం మరో ట్రక్కును ఢీ కొట్టింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ .2 లక్షలు, గాయపడిన రైతుకు రూ .50 వేలు నష్టపరిహారం ప్రకటించారు. కాగా లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు ఇచ్చినప్పటి నుంచి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల రెండు సార్లు వలస కూలీలతో వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. తాజాగా రైతులు వెళ్తున్నటక్కు ప్రమాదానికి గురికావడంతో ప్రయాణాలపై ఆందోళన వ్యక్తం అవుతోంది.