Farmhouse Deal,TRS MlAs,BJP Legal Fight,Telangana
mictv telugu

ఫామ్‌హౌస్ ఎపిసోడ్.. పది డౌట్లు

October 27, 2022

ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది? ఆ ముగ్గురిని పంపిందెవరు?ఈ నలుగురు ఎమ్మెల్యేలనే ఎందుకు ఎంచున్నారు?ఫామ్‌హౌజ్‌కు ఎంత డబ్బు తెచ్చారు?ఎక్కడ దాచారు?అసలు ఇందులో వాస్తవాలేంటి?

తెలంగాణ రాజకీయం రాత్రికిరాత్రి వేడెక్కింది. ఫామ్‌హౌజ్ ఎపిసోడ్ ప్రకంపం సృష్టిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం, బేరసారాలు,వందకోట్ల ఆఫర్… టీఆర్ఎస్ ,బీజేపీ మధ్య మాటలమంటలు రేపుతోంది. ఎవరివాదన వారు వినిపిస్తున్నారు. ఇందులో ఆది నుంచి అన్ని అనుమానాలే ఉన్నాయి.ఎన్నో ప్రశ్నలు.. కానీ సమాధానలే లేవు..

డౌట్ 1.

డబ్బు ఎంత..ఎక్కడ?

ఫామ్‌హౌస్‌లో ఎంత డబ్బు దొరికింది? బేరసారాలకోసం తెచ్చిన డబ్బు ఎంత? ఎక్కడ దాచారు? ఈ వ్యవహారం బయటపడిన నుంచి డబ్బులపై ఎవరికి క్లారిటీ లేదు. పోలీసులూ బయటకు చెప్పలేదు. కానీ రూ.100 కోట్ల ఫిగర్ వైరల్ అయింది. మూడు బ్యాగుల్లో ఏం దొరికాయి? ఎఫ్ఐఆర్‌లో పోలీసులు ఎంత డబ్బు అనే విషయాన్నిపేర్కొనలేదు. దొరికిందన్న డబ్బు ఎంతో మెన్షన్ చేయలేదు.

డౌట్ 2.

ఈ ముగ్గురినీ పంపిందెవరు?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని కలిసేందుకు రామచంద్రభారతి, నందు, సింహయాజిల్ని ఎవరు పంపారు.?ప్రలోభాల పర్వం వెనుక వున్నదెవరు?వీరికి డబ్బు సమకూర్చిందెవరు? ఢిల్లీ టు రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్ దాకా ఏం జరిగింది?

డౌట్ 3.

ఆ నలుగురు ఎమ్మెల్యేలే ఎందుకు?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు,హర్షవర్దన్ రెడ్డినే ఎందుకు కలిశారు? ఎన్నిరోజుల నుంచి వీరిని కాంటాక్ట్ చేస్తున్నారు? మునుగోడు ఉప ఎన్నికవేళనే ప్రలోభాల పర్వానికి ఎందుకు తెరలేపారు? ముందుగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత మిగతా వారిని టచ్ చేసే ప్రయత్నాలు చేయాలనుకున్నారా?

డౌట్ 4.

నిందితులకు ఎవరి డైరెక్షన్

ఏ1 రామచంద్రభారతి, ఏ2 నందు ,ఏ3 సింహయాజితో బీజేపీకి సంబంధం ఏంటి? ఎవరితో వీరికి పరిచయాలు వున్నాయి.? ఈ నలుగురి ఎమ్మల్యేల దగ్గరికి వెళ్లాలని చెప్పిందెవరు? ఢిల్లీకి చెందిన రామచంద్రభారతికి హైదరాబాద్ నందు,తిరుపతికి చెందిన సింహయాజికి జోడీ ఎలా కుదిరింది.ఎవరైనా కుదిర్చారా?

డౌట్ 5

ఇప్పుడే ఎందుకు

తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఢోకాలేదు. సర్కార్‌కి సంక్షోభ సమయం కాదు. 50 మంది ఎమ్మెల్యేల్ని కొన్నా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంచుకూడా కదిలించలేరు. మరి ఇప్పుడే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారాలకు ఎందుకు ప్రయత్నం చేశారు. ఒక్క మునుగోడు ఉప ఎన్నిక కోసమే ఇదంతా చేశారా?ఒకవేళ దీనికోసమే అనుకున్నా 2 వందల 50 కోట్లు ఖర్చుచేస్తారా?ఇదే డబ్బు మునుగోడు ఎన్నికల్లో డైరెక్ట్‌గా ఖర్చుపెట్టే అవకాశం లేకపోయిందా?ఒక్క రాజగోపాల్ రెడ్డి కోసం బీజేపీ హైకమాండ్ ఇలా చేస్తుందా?

డౌట్ 6

పోలీసులతో ఏం చెప్పారు?

రహస్య విచారణలో పోలీసులకు నిందితులు ఏం చెప్పారు? వారిని పంపింది ఎవరో చెప్పేశారా? ముగ్గురికి లింక్ ఎలా కుదిరింది పోలీసులకు వెల్లడించారా?

డౌట్ 7
ఎవరి వాడీ నందూ

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో నందూ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆయనతో కలిసి సమావేశంలో పాల్గొన్న వీడియో వుంది. మరి నందూకు కిషన్ రెడ్డికి వున్న లింకేంటి? కిషన్ రెడ్డితోనే కాదు టీఆర్ఎస్ నేతలు,మంత్రులతోనూ నందూ ఫొటోలు దిగాడని బండిసంజయ్ చెబుతున్నారు. అంతేకాదు నందూపై హవాలా ఆరోపణలు సైతం ఉన్నాయి.

డౌట్ 8
ఫామ్‌హౌస్‌లో అసలేం జరిగింది?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురు వచ్చారు. వాళ్లు ముగ్గురు వచ్చారు? రోహిత్ కంప్లయింట్ తప్ప…పోలీసులు అక్కడ అసలేం జరిగిందో ఎందుకు చెప్పడం లేదు.రూ. వంద కోట్ల ఫిగర్‌ని లీక్ చేసిందెవరు? ఎన్ని గంటల పాటు సమావేశమయ్యారు? ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్ని ముందుగా ప్రగతిభవన్ కు ఎందుకు పంపారు. రోహిత్ రెడ్డిని గంటతర్వాత ఎస్కర్ట్ వాహనంలో ఎందుకు తీసుకెళ్లారు?

డౌట్ 9.
టెక్నికల్ ఆధారాలు దొరికాయా?

ఫామ్‌హౌస్ తనిఖీల్లో సైబరాబాద్ పోలీసులకు ఏం దొరికాయి? ఈ డీల్ కు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించారా? టెక్నికల్ ఎవిడెన్స్‌లు దొరికాయా?సీసీటీవీ ఫుటే‌లో ఇది రికార్డ్ అయిందా?

డౌట్ 10.

ఈడీ, సీబీఐ కేసుల బూచిలో నిజమెంత?

నలుగురు ఎమ్మెల్యేల్ని భయపెట్టిందెవరు?ఈడీ, సీబీఐ కేసులు పెడుతామన్నదెవరు?ఒక్కో ఎమ్మెల్యేకు వందకోట్లు పెట్టాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు ఎవరికుంది? నలుగురు ఎమ్మెల్యేలతో కేసీఆర్ ని కదిలించే అవకాశమే లేదు.అయినా ఆ ముగ్గురు ఎందుకు ప్రయత్నించారు?
ఇలా ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయి. సమాధానాలు ఎప్పటికి వస్తాయో చూడాలి.