Farooq Abdullah withdraws his name from consideration as joint opposition's presidential candidate
mictv telugu

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు దెబ్బ.. ఆయన కూడా తూచ్..

June 18, 2022

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఆదిలోనే బెడిసికొడుతున్నాయి. బీజేపీకి మెజారిటీ ఉండడం వల్లో, లేకపోతే వ్యక్తిగత కారణాలో.. విషయం ఏదైనా విపక్షాల తరఫున బరిలో నిలబడేందుకు అభ్యర్థులు జంకుతున్నారు. తాను రేసులో లేనని ఎన్సీపీ నేత శరద్ పవార్ చెప్పడం తెలిసిందే. తాజాగా మరో ఆశావహ అభ్యర్థి కూడా ఝలక్ ఇచ్చారు.

తాను పోటీ చేయడం లేదని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా తేల్చిచెప్పారు. ఆమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. ‘‘జమ్మూ కశ్మీర్‌ సంక్షోభంలో సాగుతోంది. ఈ పరిస్థితిలో రాష్ట్రానికి నా సేవలు అవసరం. అందుకే విపక్షాల అభ్యర్థిత్వ పరిశీలన నుంచి నాపేరు ఉపసంహరించుకుంటున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు. తన పేరును పరిశీలించినందుకు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి, ఇతర నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తాను విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. పవార్, అబ్దుల్లా తప్పుకోవడంతో రాష్ట్రపతి ఎన్నికల రేసులో ప్రస్తుతం మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరు మాత్రమే మిగిలింది. తాను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెబుతున్నారు.