సినీ నటి జీవితా రాజశేఖర్ మోసపోయారు. డిస్కౌంట్ల ఆఫర్ ని గుడ్డిగా నమ్మేసి లక్షన్నర రూపాయలు నష్టపోయారు. తీరా అసలు విషయం తెలిసి పోలీసులను ఫిర్యాదు చేయగా, నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు చెన్నైలో పట్టుకున్నారు. నిందితుడు గతంలోనే సెలబ్రిటీలను మోసం చేసినట్టు తెలిసింది.
వివరాల్లోకెళితే.. కొన్నాళ్ల క్రితం జీవితా రాజశేఖర్ కి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది నేనేనంటూ ఫారూఖ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. అయితే బిజీగా ఉన్న జీవితా రాజశేఖర్.. తన మేనేజరుతో మాట్లాడమని చెప్పింది. మేనేజరుని మెల్లగా లైన్లో పెట్టిన ఫారూఖ్.. జియో సంబంధిత సంస్థల్లో విక్రయించే ఎలక్ట్రానిక్ వస్తువులపై మీకు 50 శాతం డిస్కౌంట్ వస్తుందని, రూ. 2.50 లక్షల ఖరీదు చేసే పరికరాలు రూ. 1.25 లక్షలకే వస్తుందని నమ్మబలికాడు. ఇది నిజమని నమ్మిన మేనేజరు వెంటనే ఫారూఖ్ చెప్పిన అకౌంటుకి రూ. 1.25 లక్షలను ఆన్ లైన్ ద్వారా పంపారు. తర్వాత ఫారూఖ్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయినట్టు గ్రహించిన మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేసిన పోలీసులు చెన్నైలో ఉన్న ఫారూఖ్ ని పట్టుకుని అరెస్ట్ చేశారు.