Farzi Web Series review Shahid Kapoor Sethupathi Kay Kay Raashii
mictv telugu

ఫర్జీ… వెబ్ సిరీస్ రివ్యూ

February 10, 2023

 

Farzi Web Series review Shahid Kapoor Sethupathi Kay Kay Raashii

విజయ్ సేతుపతి ఫస్ట్ టైమ్ ఓ బాలీవుడ్ ప్రాజెక్టులో యాక్ట్ చేయడం, షాహిద్ కపూర్ లాంటి యంగ్ హిందీ యాక్టర్ మొదటి సారి ఓ సిరీస్‌లో నటించడం, ఫ్యామిలీమ్యాన్ లాంటి సిరీసులతో మేకర్స్‌గా తమకంటూ ఓ స్పెషల్ మార్కును క్రియేట్ చేసుకున్న దర్శక ద్వయం రాజ్, డీకే లాంటి దర్శకులు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సిరీస్ కావడంతో ఫర్జీపై దేశవ్యాప్తంగా అంచనాలేర్పడ్డాయి. మరి ఈ ఎనిమిది ఎపిసోడ్ల సిరీసు ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది? ఎంత వరకు ఎంగేజ్ చేయగలిగింది?

కథ విషయానికొస్తే..
ఎలాంటి పెయిటింగ్, డ్రాయింగ్ నయినా చూసి ఉన్నది ఉన్నట్టుగా అవలీలగా గీయగల ఆర్టిస్ట్ సన్నీ (షాహిద్ కపూర్). చిన్నప్పడే అమ్మనాన్న చనిపోవడంతో తాతయ్య మహదేవ్(అమోల్ పాలేకర్) దగ్గర పెరుగుతాడు. స్వాతంత్ర సమరయోధుడైన మహదేవ్ సమాజంలో చైతన్యం రావాలన్న మంచి ఆలోచనతో, తీవ్ర నష్టాల్లో ఉన్నా క్రాంతి అనే పత్రికను నడుపుతుంటాడు. కానీ పత్రికను కొనసాగించడం కోసం చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో అప్పులవాళ్లు ప్రెస్‌ను జప్తు చేసుకుంటారు. అప్పటికే దిగువ మధ్యతరగతి వాడిగా బతుకుతూ ఆశలకి, అప్పులకి మధ్య కొట్టుకుమిట్టాడుతున్న సన్నీ పూర్తిగా విసిగిపోతాడు. ప్రెస్‌లో పనిచేసే తన స్నేహితుడైన ఫిరోజ్ (భువన్ అరోరా)తో కలిసి తనకొచ్చిన ఆర్ట్ ద్వారా దొంగనోట్లు గీసి, క్రాంతి ప్రెస్‌లోనే ప్రింట్ చేస్తుంటారు.

మరోవైపు దొంగనోట్ల దందాలో పేరుమోసిన మన్సూర్ దలాల్(కేకే మీనన్)పై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ మైఖేల్ (విజయ్ సేతుపతి) ఫోకస్ చేసి అడ్డుకోడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇదే సమయంలో మైఖేల్ టీమ్‌లో కొత్తగా జాయినయిన ఆర్బీఐ ఉద్యోగి మేఘ (రాశి ఖన్నా) తయారుచేసిన సాఫ్ట్‌వేర్ ద్వారా మన్సూర్ దొంగనోట్లను ప్రజలు సులభంగా గుర్తించడం మొదలు పెడతారు. ప్రభుత్వం కూడా ఆ సాఫ్ట్‌వేర్‌కు సపోర్ట్ చేయడంతో మార్కెట్లో దొంగనోట్లు చలామణీ కావడం కష్టమవుతుంది. అప్పుడే సన్నీ టాలెంట్ గురించి తెలిసిన మన్సూర్ తనని పిలిపించి మిషిన్లు, సాఫ్ట్‌వేర్ కూడా గుర్తించలేని విధంగా దొంగనోట్లను తయారుచేయిస్తాడు. కొన్ని వేల కోట్ల దొంగనోట్లు ప్రింటయి మార్కెట్లోకి రావడానికి రెడీ అవుతాయి. ఈ విషయం మైఖేల్‌కి తెలిసి ఎలా అడ్డుకున్నాడు? అన్ని నోట్లు జనాల్లోకి వెళ్లడానికి చేసిన ప్లాన్లేంటి? చివరికి పట్టుబడ్డారా? లేక తప్పించుకున్నారా? అనేదే అసలు కథ.

కథనం ఎలా ఉందంటే..
మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా సాగిన ఈ సిరీసులో ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ప్రధాన కథలోకి వెళ్లిపోయారు. హీరో దొంగనోట్లు ముద్రించడానికి దారితీసిన కారణాలేంటి? చిన్నతనం నుంచి తను పడ్డ కష్టాలేంటి? అని చూయిస్తూనే ఒక్కో ఎపిసోడులో ఒక్కో రకమైన ట్విస్ట్, ఇంట్రస్టింగ్ ఎలిమెంట్సుతో తెరకెక్కించారు. అత్యాశ మనిషికి ఎంతవరకూ తీసుకెళ్తుంది అని చెప్తూనే ఒకప్పుడు హీరోకి సపోర్ట్ చేసిన విలనే ఆ తర్వాత హీరోని చంపించడానికి ప్రయత్నించడం, ఆ విషయం హీరోకి తెలిసి లైఫ్ ఇచ్చిన విలన్ సామ్రాజ్యాన్ని కూలదోల్చేయాలని చూడడం.. ఇలా సాగి చివరికి రెండో సీజన్‌కి లీడ్స్ ఇస్తే మొదటి సిరీసుని పూర్తి చేశారు. మధ్య మధ్యలో విజయ్ సేతుపతి ఫ్యామిలీ సీన్స్ ఎంగేజింగ్ గా లేకపోయినా, రాశిఖన్నా, షాహిద్ మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ అంత కన్వీన్సింగ్‌గా అనిపించకపోయినా ఓవరాల్ సిరీస్ మీద ఆ ప్రభావం పడకుండా చూసుకున్నారు. మొత్తంగా అన్ని పాత్రల్ని, నేపథ్యాల్ని, వైరుధ్యాని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి రెండో సీజన్ పై మాత్రం ఇంట్రస్ క్రియేట్ చేశారనే చెప్పాలి.

ఎవరెలా చేశారంటే..

స్టార్ హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తూనే నడుస్తున్న ట్రెండ్ కు తగ్గటుగా ఓటీటీ ప్రాజెక్టుకి ఓకే చెప్పిన షాహిద్.. ఈ సిరీసుతో నటుడిగా మంచి మార్కులే కొట్టేశాడు. పాత్రపరంగా పూర్తి న్యాయం చేశాడు. విజయ్ సేతుపతి కూడా ఫస్ట్ టైమ్ బాలీవుడ్ సిరీసులో యాక్ట్ చేయడంతో అతని పాత్ర ఎలా ఉంటుందన్న హైప్ కూడా ఆడియెన్సులో పెరిగింది. నటనకు స్కోప్ ఉన్న రోల్ దొరికితే విజయ్ సేతుపతి ఏ రేంజులో నటిస్తాడో తెలిసిందే. ఇన్వెస్టిగేషన్ సీన్స్‌తో పాటు కోర్ట్ సీన్లో తన మార్క్ యాక్టింగుతో అదరగొట్టాడు. స్టయిలిష్ విలన్‌గా కేకే మీనన్ సూపరనపించాడు. కథని మలుపుతిప్పడంలో అతని పాత్ర బాగా కలిసొచ్చింది. రాశీ ఖన్నా ఓవైప్ లవ్ స్టోరీ నడిచే సీన్లతోనూ, నకిలీ దొంగల్ని పట్టుకునే టీమ్‌లో యాక్టివ్ రోల్ ప్లే చేసే సీన్లతోనూ అలరించింది. రెజీనా మొత్తంగా ఉన్నది కొన్నిసీన్లే అయినా పర్వాలేదనిపించింది. ఇక డైరెక్టర్స్ గా రాజ్, డీకే టేకింగ్ ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి ఈ సిరీసుతో ప్రూవయింది. ఫ్యామిలీ మ్యాన్ లాంటి గత సిరీసులతో పోల్చుకునే పని పెట్టుకోకపోతే ఈ సిరీసులోనూ వాళ్ల పనితనం బాగానే కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ మధ్య సిరీసుల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా అసభ్యత లేకుండా చూసుకున్నారు. కానీ డైలాగుల్లో బూతులను మాత్రం పాత్రపరంగా విరివిగా వాడేశారు.

ఓవరాల్ గా ఎలా ఉందంటే..

మరీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, బింజ్ వాచ్ సిరీస్ కాకపోయినా రాజ్, డీకే మార్క్ టేకింగ్, విజయ్ సేతుపతి పర్ఫామెన్స్, దొంగనోట్ల దందాపై డిఫరెంట్ కథ లాంటి ఎలిమెంట్స్ కోసం అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ఈ ఎనిమిది ఎపిసోడ్ల సిరీసును వీలుని బట్టి సింపుల్‌గా చూసేయొచ్చు. సెకండ్ సిరీసు కోసమూ వెయిట్ చేయొచ్చు.