దిశ కేసులో వేగం..ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు - MicTv.in - Telugu News
mictv telugu

దిశ కేసులో వేగం..ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు

December 4, 2019

దిశ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ న్యాయస్థానం ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. దిశ హత్యాచారం కేసు విచారణ వేగవంతం కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు కానుంది. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Fast track court.

దిశ హత్యాచారం కేసుపై హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని లేఖలో ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం తరపున లా సెక్రటరీ సంతోష్‌రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. గత ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ దిశ హత్య విషయాన్ని ప్రస్తావించారు. డాక్టర్ హత్య అతి దారుణమైన, అమానుష దుర్ఘటనగా అభివర్ణించారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని పేర్కొన్నారు. మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.