ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.. పేరుకు మాత్రమేనా?  - MicTv.in - Telugu News
mictv telugu

ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.. పేరుకు మాత్రమేనా? 

December 10, 2019

Fast track courts in india remains mute witnesses 

మహిళలను దేవతలతో సమానంగా పూజించే దేశం మనది. కానీ  దేశంలో ప్రతి గంటకు నలుగురు మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఇది రికార్డులకు ఎక్కిన లెక్క మాత్రమే. పోలీస్ స్టేషన్లకు చేరని కేసులు ఎన్నో.. ఎన్నెన్నో!  ఒక నిర్భయ.. ఒక అసిఫా.. తాజాగా దిశ, సమత.. వేలమందిని కామాంధులు కాటేస్తున్నాయి. ఈ దారుణాలకు నిరసనగా జనం రోడ్లపైకి వస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు తాళాలు వేస్తున్నారు. 

కానీ వారి నిరసనలు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం, కోర్టులో ప్రొసీజర్ల పేరుతో సాగతీత, బెయిళ్లు, పెరోళ్లతో పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. నేరస్తులు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారు. బాధితులపై మళ్లీ దాడులకు పాల్పడుతున్నారు. 

ఈ దారుణాలను అడ్డుకుని, నేరస్తులకు త్వరగా శిక్ష వేసేందుకు ప్రభుత్వాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశంలో అన్ని కోర్టులో  3 కోట్ల కేసులు పెండిగ్‌లో ఉన్నాయి. వీటితో నలిగిపోతున్న కోర్టులకు కొంత ఊరట కల్పిస్తూ 11వ ఆర్థిక కమిషన్ సిఫార్సుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. సెషన్స్ కోర్టుల్లోని పెండింగ్‌ కేసులను, ట్రయల్ ఖైదీల కేసులను త్వరగా తేల్చడానికి  2000వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1734 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలయ్యాయి. సాధారణంగా రెండేళ్లకంటే మించి పెండింగ్‌లో ఉన్న కేసులను.. నిందితులు బెయిల్‌పై ఉన్న కేసులను ఈ కోర్టులు విచారిస్తాయి. రిటైర్డ్ సెషన్స్ జడ్జీలను  తాత్కాలిక పదోన్నతి పొందిన జడ్జీలను ఈ కోర్టుల్లో నియమిస్తారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రతీ నెలా 14 ట్రయల్ కేసులును, లేకపోతే  20 నుంచి 25 క్రిమినల్, సివిల్ కేసులను విచారించాలి. న్యాయ శాఖ తాజా గణాంకాల ప్రకారం..  ప్రస్తుతం మన దేశంలో దాదాపు 700  ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. వీటిల్లో 6  లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సగానికిపైగా  రాష్టాల్లో ఒక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా లేదు. ఉన్న కోర్టులు కూడా సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. 

అనుకున్నదొక్కటి, అయినదొక్కటి అన్నట్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లోనూ న్యాయం నత్తనడకనే సాగుతోంది. ఈ కోర్టుల్లో నిందితుల నేరం రుజువైన వారు దోషులుగా తేలినా శిక్షలను అమలు  చేయడానికి ఏళ్ల పడుతోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు శిక్షలు విధించినా దోషులు పైకోర్టులకు వెళ్తున్నారు.

 

దీనికి  నిర్భయ కేసు చక్కటి ఉదాహరణ. 2012లో నిర్భయపై జరిగిన హత్యాచారం దేశాన్ని వణికించింది. దేశ రాజధాని నడిబొడ్డునే మహిళకు రక్షణ కరువైతే, ఇతర మారుమూల పల్లెల్లో ఎలా అని ప్రశ్నలు మొదలయ్యాయి. 2013 జనవరిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. నిర్భయపై దారుణం జరిగిన రాత్రి ఢిల్లీలో గస్తీ తిరిగిన పోలీసుల వివరాలను సమయానికి అందించడం లేదని ఢిల్లీ హైకోర్టు అప్పట్లోనే అక్షింతలు వేసిందంటే పోలీసులు ఎంత ఫాస్ట్గా దర్యాప్తు చేశారో అర్థం చేసుకోవచ్చు. 

పోలీసులు ఎట్టకేలకు సాక్ష్యాలు సంపాదించి కోర్టుకు అందించారు. 2013 సెప్టెంబరులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు నలుగురిని దోషులుగా తేల్చి మరణశిక్ష విధించింది. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టు కూడా ఖరారు చేసింది. దోషులు దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2017లో వారి అప్పీళ్లను పరిశీలించిన సుప్రీం కోర్టు.. దోషులు అత్యంత పాశవిక నేరానికి పాల్పడ్డారని, వారికి మరణశిక్షే సరైందని తీర్పు చెప్పింది. 

తర్వాత దోషులు మళ్లీ క్షమాభిక్ష పిటిషన పేరుతో శిక్షలను వాయిదా వేయించుకుంటూ వస్తున్నారు. మరోపక్క.. వారిని ఇంకెంతకాలం జైళ్లలో పెట్టి మేపుతారని జనం ప్రశ్నిస్తున్నారు. 

కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు మన దేశంలో సకాలంలో న్యాయం జరగకపోడానికి లక్ష కారణాలు ఉన్నాయి. పోలీసులు నిర్లక్ష్యం, రాజకీయ నేతల జోక్యం, చివరికి జడ్జీల్లోనూ అవినీతి కారణగా.. మామూలు కేసులే కాదు, తీవ్రమైన కేసులు కూడా ఎంతకూ తెగడం లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఈ జాడ్యాలను  తట్టుకోలేక చేతులెత్తేస్తున్నాయి. దీంతో అసలు కోర్టులపైనే ప్రజలకు నమ్మకం పోతోంది. తక్షణ న్యాయం కావాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఒత్తిడి ఎదుర్కొంటున్న పోలీసులు.. నిందితుల నేరం రుజువు కాకముందే ఎన్‌కౌంటర్ల పేరుతో వారిని కాల్చిచంపుతున్నారు. జనం కూడా స్వాగతిస్తున్నారు. 

కానీ ఎన్ కౌంటర్లు ఈ సమస్యకు పరిష్కారం కావు. వరంగల్‌లో యాసిడ్ దాడికి పాల్పడిన వారిని కాల్చిచంపినా ఆ దాడులు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. దిశ కేసు నిందితులను చంపినప్పటికీ అత్యాచారాలు ఆగడం లేదు. సత్వర న్యాయం అంటే అన్యాయమే అని సాక్షాత్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నేరం ఎంత పెద్దదైనా కోర్టు ద్వారా శిక్షించడమే మంచిదని హితవు పలుకుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మళ్లీ తెరపైకి వచ్చాయి. అత్యాచారాల అడ్డగా మారిపోయిన ఉత్తరప్రదేశ్‌లో నేరస్తులను తక్షణం శిక్షించడానికి 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. బాలలపై లైంగిక నేరాలను విచారించడానికి పోక్సో చట్టం కింద అరెస్టయిన నిందితులను విచారించేందుకు 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చెప్పారు.. 

ఇలాంటి కోర్టులు ఎన్ని ఏర్పాటైనా అధికార యంత్రాంగంలో.. ముఖ్యంగా ప్రభుత్వంలోపోలీసుల్లో చిత్తశుద్ధి లేకపోతే బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. మన దేశ న్యాయవ్యవస్థ గడ్డు సవాళ్లను ఎదుర్కొంటోంది. మూలాల నుంచి రోగప్రక్షాళన మొదలుపెట్టకుండా పైపై మెరుగులు దిద్దితే ఫలితం ఉండదు. దేశంలోని 3 కోట్ల కేసులను విచారించడానికి సరిపడినన్ని కోర్టులు లేవు. జడ్జీలు, న్యాయవాదులు తక్కువ సంఖ్యలోనే  ఉన్నారు. న్యాయప్రక్రియ నెమ్మదిగా సాగడంతో వేలమంది అమాయాకులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. అసలైన నేరస్తులు దర్జాగా బయట తిరుగుతున్నారు. ఫలితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కేవలం అలంకార ప్రాయంగానే మిగిలిపోతున్నాయి.