‘జమైకా చిరుత’ రికార్డును బ్రేక్ చేసిన ‘కర్ణాటక చిరుత’ - MicTv.in - Telugu News
mictv telugu

‘జమైకా చిరుత’ రికార్డును బ్రేక్ చేసిన ‘కర్ణాటక చిరుత’

February 14, 2020

Karnataka

ఇన్ని రోజులు చిరుతలా పరుగెత్తే స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ వేగం గురించి కథలు కథలుగా చెప్పుకున్నాం. బోల్ట్‌ను తలదన్నేవాడు రాడు.. రాలేడు.. రాబోడు అనుకున్నాం. కానీ, వచ్చాడు. అతనెవరో పరాయి దేశస్థుడు కాదు. మన భారతీయుడే.. మన పొరుగునే ఉన్న కర్ణాటక యువకుడు. బోల్ట్ లాంటి వేగాన్నే పరిచయం చేశాడు. అతని పేరు శ్రీనివాస గౌడ. 28 ఏళ్ల ఈ యువకుడు పరుగెత్తితే చిరుత తాత పరుగెత్తినట్టే ఉంటుంది. మంగుళూరు, ఉడిపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయ ‘కంబాల’క్రీడలో శ్రీనివాస గౌడ 30 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రికి చెందిన ఈ రేసర్‌ 13.62 సెకండ్లలో 142.50 మీటర్లు పరుగెత్తి.. ఉసేన్‌ బోల్ట్‌ (9.58 సెకండ్లలో 100 మీటర్లు) ప్రపంచ రికార్డును గుర్తు చేశాడు.

142.50 మీటర్ల దూరాన్ని 100 మీటర్లకు లెక్కించినపుడు.. కన్నడ యువకుడు ‘జైమైకా చిరుత’ కన్నా 0.03 సెకండ్లు ముందంజలో ఉండటం విశేషం. ఈ పరుగు ఎలా ఉంటుందంటే.. రెండు దున్నపోతులతో పాటు మనిషి బురదమయమైన పంట పొలాల్లో పరుగెత్తాలి.  కంబాల ఆటలో గెలిచిన వారికి లక్షల్లో బహుమతి కూడా ఉంటుంది. ఈ బురద పరుగు పందెంలో శ్రీనివాస గౌడ బోల్ట్‌ కన్నా వేగంగా పరెగెత్తుతున్నాడని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురుస్తున్నారు. భారత ప్రభుత్వం అతన్ని ఒలింపిక్స్‌కు తయారు చేయించాలని కోరుతున్నారు. 

సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా నిర్వహిస్తున్నకంబాల క్రీడలో ప్రధానంగా యువకులు పాల్గొంటారు. తనకు కంబాల అంటే ఎంతో ఇష్టం అంటున్నాడు శ్రీనివాస్. ఈ విజయం తన దున్నల వల్లనే సాధ్యమైంది అంటున్నాడు. అవి వేగంగా పరుగెత్తడం వల్లే తానూ అంతే వేగంగా పరుగెత్తగలిగానని చెబుతున్నాడు. కాగా, పశువులను హింస పెడుతున్నారని జంతు ప్రేమికుల అభ్యంతరంతో గతంలో కొన్నాళ్లపాటు కంబాలను నిషేధించారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ ఆటను పున:ప్రారంభించారు.