”అమెరికా దేశంలో తెలుగు భాష అత్యంత వేగంగా అభివృద్ది చెందుతుంది. అమెరికాలో అధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడే తొలి 20 భాషల్లో తెలుగు భాషకు చోటుదక్కింది. తెలుగు భాషాభివృద్ధికి సిలికానాంధ్ర మనబడి చేస్తున్న కృషి మాటల్లో వర్ణించలేనిది. పదిహేనేళ్లలో 75 వేల మంది తెలుగు నేర్చుకున్నారు. అంతేకాదు, 2021-22 విద్యా సంవత్సరానికి గాను తెలుగులో 1,689 మంది జూనియర్ సర్టిఫికెట్లో, 1,102 మంది సీనియర్ సర్టిఫికెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం గొప్ప విషయం” అని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
ఉత్తర కాలిఫోర్నియాలోని మిలిపెటాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని డాక్టరు లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం స్నాతకోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధినేత చమర్తి రాజు మాట్లాడుతూ..”తెలుగు విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో ఎనిమిదేళ్లుగా అమెరికాలో తెలుగు ఈ సర్టిఫికెట్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. 15 ఏళ్లుగా పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తున్నా విద్యాసంస్థ సిలికానాంధ్ర, మనబడి మాత్రమే. ఈ విజయం వెనుక 2,500 మంది భాషా సైనికుల స్వచ్ఛంద సేవ ఉంది. అమెరికాలోని పిల్లలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు భాషనూ నేర్పిస్తున్నాం. పదిహేనేళ్లలో 75 వేల మందికి తెలుగు నేర్చుకున్నారు.” అని ఆయన అన్నారు.
ఇక, 2022-23 మనబడి విద్యాసంవత్సరం సెప్టెంబరు 10 నుంచి మొదలవుతుందని సంస్థ అధినేత చమర్తి రాజు తెలిపారు. http://manabadi. siliconandhra org/ అనే వెబ్ సైట్లో తమ పిల్లల పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.