Father and daughter attended the job fair in rajolu
mictv telugu

నిరుద్యోగానికి పరాకాష్ట.. ఉద్యోగమేళాకు హాజరైన తండ్రీ కూతురు

November 5, 2022

దేశంలో నెలకొన్న నిరుద్యోగానికి పరాకాష్ట ఇది. ఉద్యోగం కోసం తండ్రీ కూతురు ఓ జాబ్ మేళాకు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో తండ్రి దివ్యాంగుడు కావడం గమనార్హం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఉద్యోగ మేళాకు ఎంఏ, బీఈడీ చేసిన సోంపల్లికి చెందిన 48 ఏళ్ల తండ్రి శ్రీనివాస్, డిగ్రీ చదువుతున్న కుమార్తె వాసవి ప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడేళ్లుగా ఉద్యోగ మేళాక హాజరవుతున్నానని శ్రీనివాస్ తెలిపారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎంపిక జాబితాలో పేరు ఉంటున్నా ఉద్యోగం మాత్రం ఇవ్వడం లేదని వాపోయాడు. తనకు అందుతున్న దివ్యాంగ పింఛను సరిపోకపోవడంతో కుటుంబ అవసరాల కోసం ఉపాధి పనులకు సైతం వెళ్తున్నట్టు వెల్లడించాడు. ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువవడంతో డిగ్రీ చదువుతున్న కుమార్తె కూడా మేళాకు హాజరైనట్టు తెలిపాడు. ఈ సారైనా ఉద్యోగం వస్తే తన కుటుంబ ఇబ్బందులు తీరిపోతాయని ఆశతో ఉన్నాడు.