ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో చరిత్ర సృష్టించిన తండ్రీకూతుళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో చరిత్ర సృష్టించిన తండ్రీకూతుళ్లు

July 6, 2022

భారత వైమానిక దళంలో తండ్రీకూతుళ్లు కొత్త చరిత్ర సృష్టించారు. ఇద్దరూ మే 30న హాక్ 132 యుద్ధ విమానాలను ఒకే ఫార్మేషన్‌లో నడిపి రికార్డు సాధించారు. ఇలా జరగడం ఎయిర్ ఫోర్స్ చరిత్రలో ఇదే తొలిసారి. వారి పేర్లు సంజయ్ శర్మ, అనన్య. సంజయ్ శర్మ ఎయిర్ కమాండర్ కాగా, అనన్య ఫ్లయింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. సంజయ్ శర్మ 1989లో ఫైటర్ పైలెట్‌గా విధుల్లో చేరి తర్వాత మిగ్ 21 వంటి ఫైటర్ జెట్లను నడిపే స్థాయికి ఎదిగారు. తండ్రి స్పూర్తితో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌ చదివిన అనన్య.. తాను కూడా పైలెట్ అవ్వాలని కోరిక ఉండేది. అయితే మహిళలకు ఆ అవకాశం లేకపోవడంతో మొదట్లో కొంత నిరుత్సాహపడింది. 2016 నుంచి మహిళలకు కూడా అనుమతి లభించడంతో అవకాశం కోసం ప్రయత్నించగా, ఫ్లయింగ్ బ్రాంచ్ శిక్షణ కోసం ఎంపికైంది. తర్వాత ట్రైనీ ఫ్లయింగ్ ఆఫీసర్‌గా చేరి 2021 డిసెంబరులో ఫైటర్ పైలెట్‌గా బాధ్యతలు స్వీకరించింది. ఈ క్రమంలో తండ్రితో యుద్ధ విమానాన్ని నడిపి చరిత్రలో తొలి మహిళగా నిలిచింది.